కలం, నిజామాబాద్ బ్యూరో: దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ప్రధాని మోదీ రూపంలో లభించారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) పేర్కొన్నారు. 2047 నాటికి దేశంలో భారీ మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఐటీ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు.. ఎంతో అవమానించారని గుర్తు చేసుకున్నారు. కానీ ఐటీ రంగం ప్రపంచాన్ని ఎలా శాసిస్తుందో ప్రత్యక్షంగా అందరూ చూస్తున్నారని వివరించారు. 1991లో మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయని.. చైనా ఆ విషయంలో ఎంతో ముందుకెళ్లిపోయిందన్నారు. టెక్నాలజీ సులువుగా అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇప్పుడు ఏఐ వచ్చేసిందన్నారు.
అమరావతి నుంచే క్వాంటమ్ కంప్యూటర్లు..
సిలికాన్ వ్యాలీ నుంచి క్వాంటమ్ వ్యాలీ స్థాయికి వచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు.. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేశామని. దేశంలోనే ఇదే మొదటిదన్నారు. ఇది రావడానికి ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి కారణమన్నారు. ఆయన నాకు ఫోన్ చేసి దీని గురించి చెప్పినప్పుడు.. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించామన్నారు. నెల రోజుల్లోనే ఐబీఎంతో ఒప్పందం చేసుకున్నామని.. 2027 ఫిబ్రవరిలో క్వాంటమ్ కంప్యూటర్ లాంచ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. అమరావతి నుంచే క్వాంటమ్ కంప్యూటర్లు దేశానికి సరఫరా కాబోతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రపంచానికే ఎగుమతి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

