కలం, వెబ్‌డెస్క్: అబుదాబిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్ (Smit Machchhar)ను యూఏఈ ఉప ప్రధాని హమ్దాన్ బిన్ మహమ్మద్ (Hamdan bin Mohammed) శనివారం పరామర్శించారు. స్మిత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. అత్యుత్తమ ధైర్యసాహసాలు, బాధ్యతలను ప్రదర్శించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ దేశానికే గర్వకారణమని కొనియాడారు. ఆయన లాంటి వారు యూఏఈ బృందంలో భాగం కావడం తమ దేశ విలువలు, శాంతి, కరుణలకు ప్రతీక అని పేర్కొన్నారు. స్మిత్ మచ్ఛర్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని వెల్లడించారు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం ప్రయాణిస్తుండగా స్మిత్ మచ్చర్‌పై ఆయన కో పైలట్ కాక్‌పిట్‌లోనే కత్తితో దాడి చేశాడు. విమానాన్ని కూల్చివేసే ఉద్దేశంతో కో పైలట్ జరిపిన ఈ షాకింగ్ పరిణామంతో స్మిత్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి ఆయన కాక్‌పిట్ డోర్‌ను తెరిచి, ప్రయాణికులు, సిబ్బంది సహాయంతో పెను ప్రమాదాన్ని తప్పించి వందలాది మంది ప్రాణాలను కాపాడారు. ఈ దాడిలో గాయపడిన ఆయన అబుదాబి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్మిత్ తో భారత ప్రధాని మోదీ సైతం వీడియో కాల్ మాట్లాడారు.

