కలం, నిజామాబాద్ బ్యూరో: యువత డ్రగ్స్, సైబర్ నేరాల జోలికి వెళ్లొద్దని నిజామాబాద్ జిల్లా జడ్జి దుర్గాప్రసాద్ (Judge Durgaprasad) హెచ్చరించారు. న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థులకు పోక్సో చట్టం, డ్రగ్స్ సైబర్ నేరాల అంశాలపై న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. జడ్జి దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
విద్యార్థులు చట్టాలు, వాటి శిక్షలపై అవగాహన ఏర్పరుచుకోవాలన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి విద్యార్థికి అర్థమయ్యేలా జడ్జి దుర్గాప్రసాద్ అవగాహన కల్పించారు. తల్లిదండ్రుల గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ప్రవర్తించాలని సూచించారు. ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కితే జీవితంలో చాలా నష్ట పోతారని హెచ్చరించారు. కాలేజీ ప్రిన్సిపల్ రామ్మోహన్, న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదారి, నారాయణ, ప్రతిభ, అపూర్వ పాల్గొన్నారు.

