కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు(BC Reservation) కల్పించే విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 34 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు అక్టోబర్ 1న రద్దు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, బీసీ రిజర్వేషన్లను నిర్ణయించేందుకు అవసరమైన నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ఈ తీర్పు వెలువరించింది.
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ పిటిషన్
బీసీలకు రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అధికారులను ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ వచ్చే వారంలోనే విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో బీసీ రిజర్వేషన్ల అంశం తదుపరి న్యాయపరమైన పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

