పట్టభద్రుల పోరు: కాంగ్రెస్ సర్కార్‌కు అగ్నిపరీక్ష!

కలం, తెలంగాణ బ్యూరో: రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduate MLC Elections) ఎన్నికల తీర్పు ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా మారనుంది. ఈ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నందున.. వాళ్లంతా ఆలోచించి ఓటు వేస్తారని, ప్రలోభాలకు లొంగకపోవచ్చనే అభిప్రాయం నెలకొన్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఈ మూడు వర్గాలు సర్కార్‌‌పై అసంతృప్తిగా ఉండడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌కు సవాల్‌గా మారింది.

ఆరు డీఏలకు గాను రెండు డీఏలను ప్రకటించడం, వాటినీ ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతుల్లో చెల్లిస్తామని చెప్పడం, పీఆర్సీ, సీపీఎస్ రద్దుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సర్కార్‌‌పై ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి నెలకొన్నది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలుకావడం లేదని.. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగుల్లో ఆగ్రహం నెలకొన్నది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఓటర్లలో ఉద్యోగులు, ఉపాధ్యాయులే దాదాపు 50% ఉంటారని అంచనా. మిగిలినవారు నిరుద్యోగ పట్టభద్రులు, ప్రొఫెషనల్స్, ప్రైవేట్ ఉద్యోగులు. ఇప్పుడు వీళ్ల ఓటింగే అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేయనున్నది.

ఉద్యోగుల రెండు డీఏలు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ.. మెజారిటీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి నెలకొన్నది. మొత్తం ఆరు డీఏలు పెండింగ్‌లో ఉంటే, రెండింటికి మాత్రమే క్లియరెన్స్ వచ్చిందని, ఇంకా నాలుగు పెండింగ్‌లోనే ఉన్నాయని ఉద్యోగులు అంటున్నారు. దీనికి తోడు పీఆర్సీ, సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డుల విషయంలో ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కేబినెట్‌లో కనీసం చర్చించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు నిరుద్యోగ పట్టభద్రుల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత నెలకొన్నది. గతంలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. దాని ప్రకారమే పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించింది. కానీ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలుకావడం లేదని, పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే పలుచోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేపట్టారు.

కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆందోళన

కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే ఖరారు కావడంతో ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం మొదలుకానున్నది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరిగే పోలింగ్ వరకూ దీర్ఘకాలం ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమనే టెన్షన్‌తో పాటు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎలాంటి ప్రతికూల ఫలితానికి దారితీస్తుందోన్న ఆందోళనా అభ్యర్థులను వెంటాడుతున్నది.

రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలు మినహా మిగిలిన ఆరు ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. రాష్ట్రంలో దాదాపు మూడింట రెండొంతుల మేర జిల్లాలు పార్టీల భవిష్యత్తును డిసైడ్ చేసేవిగా మారాయి. పోలింగ్ జరిగే నాటికి పీఆర్సీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన, హామీ చేసినట్లయితే ఓటర్ల మైండ్‌సెట్ మారే అవకాశమున్నదనేది ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభిప్రాయం. సీపీఎస్ రద్దు విషయంలోనూ ప్రభుత్వం విధాన ప్రకటన చేస్తే పరిస్థితిలో కొంత మార్పు రావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గెలుపు కోసం కాంగ్రెస్ అభ్యర్థులు గ్రౌండ్ రియాలిటీపై ప్రభుత్వంతో మాట్లాడి ఎలాంటి ప్రకటన చేయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

హైదరాబాద్‌ సెగ్మెంట్‌ డిఫరెంట్

నల్లగొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికతో పోలిస్తే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల ఎన్నిక కాస్త డిఫరెంట్‌గా ఉంటుందనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెగ్మెంట్‌లో ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, నర్సింగ్ ఆఫీసర్లు.. ఇలాంటి వివిధ రకాల ప్రొఫెషనల్స్ ఎక్కువగానే ఉంటారని, వీరి ఓటు బ్యాంకు కూడా కీలకమన్నది అన్ని పార్టీల అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ పట్టభద్రులు సైతం జాబ్ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నందున వారిని కన్విన్స్ చేయడం ప్రభుత్వానికి అనివార్యంగా మారింది. ఇప్పటికే జాబ్ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వానికి వారి నుంచి నిరసన ఎదురైంది. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ-ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ ఆస్పత్రులు, సెక్రటేరియెట్, వివిధ ప్రభుత్వ విభాగాలు హైదరాబాద్‌లో ఉన్నందున వాటిల్లో పని చేస్తున్న గ్రాడ్యుయేట్ ఓటర్లు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించనున్నారు.

ఓటర్ల సంఖ్య – అంచనా వివరాలు:

ఈ గ్రాడ్యుయేట్ స్థానాల్లో నమోదైన ఓటర్ల వివరాలను పరిశీలిస్తే.. నల్లగొండ – వరంగల్ – ఖమ్మం సెగ్మెంట్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు 5 లక్షలుగా ఉంది. ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు 55,000 మంది, ప్రైవేట్ ఉపాధ్యాయులు 45,000 మంది కాగా.. ఒక్క టీచర్ల ఓట్లే దాదాపు లక్ష వరకు ఉన్నాయి. ఇక హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం ఓటర్లు 5.50 లక్షలుగా అంచనా వేశారు. ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు 40,000 మంది, ప్రైవేట్ ఉపాధ్యాయులు 75,000 మంది కాగా.. మొత్తం టీచర్ల ఓట్లు 1.15 లక్షల వరకు ఉన్నాయి. రెండు స్థానాల్లోనూ ఉద్యోగులు, ఉపాధ్యాయులే దాదాపు 50% వరకు ఉండగా, మిగిలిన ఓట్లలో నిరుద్యోగ పట్టభద్రులు, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ ఉన్నారు.

ప్రభుత్వ నిర్ణయమే కీలకం

అయితే ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లేదన్న అసంతృప్తి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో నెలకొన్నది. సీఎస్‌తో ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు సమావేశమైన సందర్భంగా ప్రభుత్వం నుంచి పీఆర్సీ, సీపీఎస్ రద్దుపై స్పష్టమైన హామీ లేకపోవడాన్ని వాళ్లు తప్పుపడుతున్నారు. కొంతమంది జేఏసీపైనే నమ్మకం కోల్పోయారని.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో చీలిక తప్పదనే చర్చ కూడా మొదలైంది.

ప్రభుత్వం నుంచి పీఆర్సీ ఫిట్‌మెంట్, పెండింగ్ డీఏలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ సెటిల్‌మెంట్, సీపీఎస్ రద్దు.. వీటిపై స్పష్టమైన హామీ వస్తేనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మార్పు ఉంటుందని, లేదంటే ఈ వ్యతిరేకత కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా ఓటింగ్ విషయంలో నిర్ణయం తీసుకుంటామని, ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లవుతున్నా ఇచ్చిన హామీలేవీ అమలుకాలేదన్న అభిప్రాయాన్ని పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>