కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో త్వరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, సమన్వయం , క్షేత్రస్థాయి సిద్ధతపై చర్చించేందుకు ఆయన పార్టీ కోఆర్డినేషన్ కమిటీలు, అలాగే సీనియర్ నేతలతో నేడు అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల పొత్తుల ఫార్ములాకు భిన్నంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయి బలాబలాలు , స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ సమావేశంలో వార్డు, పంచాయతీ, మండల, మున్సిపల్ స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించనున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీలతో క్షేత్రస్థాయిలో ఎలాంటి ఘర్షణలు లేకుండా సమన్వయం చేసుకోవడం, స్థానిక నాయకుల, కార్యకర్తల ఆకాంక్షలను కాపాడుతూ సీట్ల సర్దుబాటుపై సజావుగా నిర్ణయాలు తీసుకోవడంపై సమన్వయ కమిటీ సభ్యులకు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నారు.
కాగా, ఈ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఇప్పటికే ఉన్న పాత పార్లమెంటరీ కమిటీల స్థానంలో నూతన వ్యూహాత్మక కమిటీలను ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించారు. స్థానిక ఎన్నికల్లో జనసేన కేడర్ సత్తా చాటేలా, ప్రతి నియోజకవర్గంలో పార్టీ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

