కలం, స్పోర్ట్స్ : ఐసీసీ 2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఈ షెడ్యూల్‌ను చూసి పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ జట్టు చాలా సంతోషపడుతుందని భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel) సరదాగా వ్యాఖ్యానించారు. స్టార్ స్పోర్ట్స్ చర్చా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ప్రతి జట్టు ఆలోచనా విధానం వేరుగా ఉంటుందని చెప్పారు. భారత జట్టు కనీసం సెమీఫైనల్ చేరాలని లక్ష్యంగా పెట్టుకుంటుందని అన్నారు. కానీ ఈ షెడ్యూల్ చూశాక పాకిస్థాన్ మాత్రం తాము కచ్చితంగా సూపర్-7 దశకు చేరుకుంటామని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి చూద్దామని అనుకుంటూ ఉంటుందని ఎద్దేవా చేశారు. రెండో రౌండ్‌కు అర్హత సాధిస్తే చాలని పాక్ జట్టు భావిస్తోందని పార్థివ్ అభిప్రాయపడ్డారు.
ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పోటీ పడుతున్నాయి. వీటిని గ్రూప్-ఎ, గ్రూప్-బిగా విభజించారు. గ్రూప్-ఎలో భారత్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, అఫ్గానిస్థాన్‌లతో పాటు పాకిస్థాన్ ఉంది. క్వాలిఫైయర్-ఎ ద్వారా మరో జట్టు చేరనుంది. రెండు గ్రూప్‌లలోని టాప్-3 జట్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఉత్తమ జట్టు సూపర్-7 దశకు అర్హత సాధిస్తాయి. సూపర్-7 దశ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 14 వరకు జరుగుతుంది. అందులో ప్రతి జట్టు మరో ఆరు మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. మొదటి రౌండ్ పాయింట్లు ఇక్కడ పరిగణించరు. ఆ తర్వాత టాప్-4 జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి.
గత 2023 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా విజేతగా నిలవగా, పాకిస్థాన్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. వరల్డ్ కప్ గ్రూప్ దశ పోరు అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌తో మొదలవుతుంది. అక్టోబర్ 9న దక్షిణ ఆఫ్రికా-న్యూజిలాండ్, జింబాబ్వే-క్వాలిఫైయర్-ఎ మ్యాచులు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ పోరు అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది.

