కలం, తానూర్: ముధోల్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Rama Rao) అన్నారు. తానూర్ మండలం బొంద్రేడ్ (Bondrat) గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఎడ్లబండిపై గ్రామంలోకి తీసుకొచ్చి సంప్రదాయబద్ధంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభించారు.
అలాగే రూ. 21 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. బొంద్రేడ్ నుంచి బోసి వరకు రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జాతీయ రహదారి 61 నుంచి హమ్రూసర్ గుట్ట వరకు రహదారి నిర్మాణాన్ని హెచ్ఏఎం విధానంలో మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తానూర్ మండల రైతులకు కీలకమైన వ్యవసాయ రంగంలోని 28వ ప్యాకేజీ అంశాన్ని అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. ఈ ప్యాకేజీ అమలైతే మండల రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

