కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహాత్మా గాంధీ చూపిన సామరస్య విధానంలో మనమంతా ముందడుగు వేసి, లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని డీసీసీ అధ్యక్షులు ఏ.సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంగంపల్లి సంజీవ్ ముదిరాజ్ శుక్రవారం స్థానిక అశోక్ టాకీస్ చౌరస్తాలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ సత్యం, అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గాలను ఆయుధాలుగా చేసుకుని భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడమే కాకుండా, యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచారన్నారు.
గాంధీజీ కలలు కన్న రామరాజ్యం అంటే ప్రతి ఒక్కరూ ఐక్యంగా, సమానత్వంతో, మత సామరస్యంతో జీవించే సమాజమని ఆయన అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య సాధన కోసం పోరాడిందనీ, అదే స్ఫూర్తితో నేడు కూడా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు.
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనీ, గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సామరస్య మార్గాల్లో నడుస్తూ దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఐక్యంగా కృషి చేయాలనీ తెలిపారు. గాంధీజీ కలలు కన్న సమానత్వం, సామాజిక న్యాయం, మత సామరస్యంతో కూడిన భారతదేశ నిర్మాణానికి మనమందరం పునరంకితం కావాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదులా కొత్వాల్, మేయర్ శ్రీమతి గుమ్మల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ శ్రీ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ కమిటీ సభ్యులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, బెక్కరి మధుసూదన్ రెడ్డి, వేముల కృష్ణయ్య, ఎం.ఏ. కలీమ్, బంగ్లా రవి, రాములు యాదవ్, మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, మండల అధ్యక్షులు మహేందర్, కార్పొరేటర్లు తాహెర్, రమేష్ బాబు, సద్దుల శేఖర్, ఉమర్ కొత్వాల్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

