కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరవాసులకు ప్రజా రవాణా వ్యవస్థ తీపి కబురు అందించింది. మెట్రో రైళ్లు, ఆర్టీసీ సిటీ బస్సుల్లో ఒకే పాస్ (Metro – RTC Common Pass) తో ఉమ్మడిగా ప్రయాణించే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం రోజువారీ, నెలవారీ జాయింట్ పాస్ ఛార్జీలను అధికారులు అధికారికంగా ఖరారు చేశారు.
ఈ నూతన విధానం ప్రకారం, రోజువారీ కామన్ పాస్ ధరను రూ.400గా నిర్ణయించారు. ఇందులో మెట్రో వాటా రూ.300 కాగా, ఆర్టీసీ వాటా రూ.100గా ఉంటుంది. అదేవిధంగా, నెలవారీ కామన్ పాస్ ధరను రూ.8,500గా ఖరారు చేశారు. ఈ మంత్లీ పాస్‌లో మెట్రో ఛార్జీ కింద రూ.7,000, ఆర్టీసీ ఛార్జీ కింద రూ.1,500 కేటాయించారు. ఈ పాస్‌ల ద్వారా ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల నడిచే అన్ని రకాల ఆర్టీసీ సిటీ బస్సులతో పాటు మెట్రో రైళ్లలో సులభంగా ప్రయాణించవచ్చు.
ప్రయాణికులు డిజిటల్ పద్ధతిలో సులభంగా టికెట్లు, పాస్‌లు పొందేందుకు వీలుగా అప్‌గ్రేడ్ చేసిన ‘మీ టికెట్’ (MeeTicket) మొబైల్ యాప్‌ను నేడు లాంచ్ చేస్తున్నారు. కేవలం సిటీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం వారానికి రూ.600 ఛార్జీతో ప్రత్యేక వీక్లీ డిజిటల్ బస్ పాస్‌ను కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఉమ్మడి పాస్ (Metro – RTC Common Pass) విధానం వల్ల రోజూ రాకపోకలు సాగించే ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు సమయంతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా మిగులుతాయి.
Also Read : ఎల్ నినో ఎఫెక్ట్.. పాలమూరులో చేపల పెంపకానికి బ్రేక్!
Follow Us On: X(Twitter)

