గాంధీజీ ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి: ఎమ్మెల్యే బాలు నాయక్

కలం, దేవరకొండ: మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహ మార్గాలు నేటి సమాజానికి, కాంగ్రెస్ పార్టీకి నిరంతరం మార్గదర్శకాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (MLA Nenavath Balu Naik) అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా గురువారం దేవరకొండ (Devarakonda) పట్టణంలోని 16వ వార్డు గాంధీ బజార్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్లతో కలిసి గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బాలు నాయక్, మీడియాతో మాట్లాడుతూ.. గాంధీజీ దేశానికి చేసిన అమూల్యమైన సేవలను, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పోషించిన చారిత్రాత్మక పాత్రను గుర్తుచేసుకున్నారు. సత్యాగ్రహం, అహింసలనే ఆయుధాలుగా చేసుకుని గాంధీజీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలిచారని ఎమ్మెల్యే చెప్పారు.

ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి చైతన్యపరిచిన తీరు భారత చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శప్రాయమని తెలిపారు. గాంధీజీకి కాంగ్రెస్ పార్టీతో విడదీయరాని అనుబంధం ఉందన్న ఆయన, కాంగ్రెస్‌ను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. గ్రామీణ ప్రజలను పోరాటంలో భాగస్వాములను చేసి, సాధారణ ప్రజలే ఈ దేశానికి అసలైన బలమని నిరూపించారన్నారు.

గాంధీజీ జయంతి రోజున కేవలం విగ్రహాలకు పూలమాలలు వేయడమే కాకుండా, ఆయన కలలు కన్న సమానత్వం, సామాజిక న్యాయం, శాంతి, సోదరభావాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని బాలు నాయక్ పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మున్సిపల్ వర్కర్ల సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మాజీ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, నాయకులు దూదిపాల వేణుధర్ రెడ్డి, మహమ్మద్ రయీస్, మారుపాకుల సురేష్ గౌడ్, నజీరుద్దీన్, వాంకునావత్ బిక్కు నాయక్, కిన్నెర హరికృష్ణ, స్థానిక కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>