కలం, ఖమ్మం బ్యూరో: నివాస గృహాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న వ్యభిచార స్థావరంపై పాల్వంచ పోలీసులు మెరుపు దాడి చేసి రట్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ (Palvancha) మండలం దమ్మపేట (Dammapeta) సెంటర్‌లోని త్రివేణి స్కూల్ సమీపంలో ఉన్న ఒక ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో, పట్టణ ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.
ఈ దాడుల్లో వ్యభిచార గృహాన్ని నడుపుతున్న ప్రధాన నిర్వాహకులు సంధ్యా అలియాస్ ప్రశాంతి, బేబీ శ్యామలా అలియాస్ అనూషలతో పాటు నలుగురు మహిళలు, ఇద్దరు విటులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి రూ. 2,000 నగదుతో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నాగరాజు వెల్లడించారు. పట్టణంలో లేదా నివాస ప్రాంతాల్లో ఇటువంటి అసాంఘిక, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

