కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఎల్ నినో ఎఫెక్ట్ (El Nino Impact) మత్స్య సంపదపైనా పడింది. వేలాది మత్స్యకారులకు కుటుంబాలను కోలుకోలేని దెబ్బతీసింది. వానాకాలంలో గట్టిగా నాలుగు చినుకు పడితే చాలు చెరువులు, కుంటలు నిండేవి. మత్స్యకారుల జీవితాల్లో ఉపాధి వెలుగులు కనిపించేవి. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే చేప పిల్లలతో చెరువులు కళకళలాడేవి. కానీ, ఈసారి పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.
ప్రకృతి కన్నెర్ర జేయడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చేపల పెంపకం నెమ్మదించింది . దాదాపు 4,253 చెరువులు, కుంటలతో పాటు సుమారు 27 రిజర్వాయర్లు ఉండగా.. వానాకాలం రోజుల్లో అలుగు పారి, చేపల పెంపకానికి అనుకూలంగా మారాలి. కానీ, ఎల్ నినో తీవ్రతతో వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ చెరువుల్లో కనీస నీటి మట్టం కూడా లేదు. చేప పిల్లలను చెరువుల్లో వదలాలంటే సగం వరకైనా నీరుండాలి. వర్షాలు లేక ఎండ తీవ్రతతో ఉన్న నీరు కూడా ఆవిరైపోతోంది.
ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు
ఉమ్మడి జిల్లాలో దాదాపు 721 మత్స్యకార సొసైటీలో 52,500 మంది కార్మికులు ఉన్నారు. చెరువుల్లో నీరు లేకపోవడంతో చేప పిల్లల విడుదల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇటీవల రాష్ట్ర మత్స్య పారిశ్రామిక అభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వనపర్తి జిల్లాలో చేప పిల్లలను పంపిణీచేశారు. అయితే.. ఆలస్యంగా వదలడంతో మత్స్యకారులు అయోమయంలో పడ్డారు. వీరికి ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో రిజర్వాయర్ల పరిధిలో తప్ప, మిగతా చెరువులు, కుంటల కింద ఏర్పడిన సొసైటీలు సభ్యులు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
పంపిణీకి సిద్ధంగా ఉన్నా కానీ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కూడా ఈసారి నీటి కొరతతో ఆశించిన స్థాయిలో సాగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది రూ. 133.31 కోట్ల ఖర్చుతో చేప పిల్లలను ఉచితంగా అందించేందుకు ఏర్పాటు చేసింది. 84.59 కోట్ల చేప పిల్లలను అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించుకుంది. మరో 10 కోట్ల రొయ్య పిల్లలను కూడా మత్స్యకారులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఉమ్మడి జిల్లాలో చెరువులు కుంటలలో చేప పిల్లలను వదిలేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 10.38 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనుండగా.. జూరాల, కోయిల్ సాగర్, రామన్ పాడు, సంఘంబండ ప్రాజెక్టులతో పాటు నోటిఫై చేసిన పెద్ద చెరువుల్లో 50 – 70 లక్షల వరకు రొయ్య పిల్లలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నా, వాటిని వేయడానికి చెరువుల్లో నీరు లేదు. లేని చోట చేప పిల్లలను వదిలితే అవి చనిపోయే ప్రమాదం ఉండటంతో చాలా సొసైటీలు వెనకడుగు వేస్తున్నాయి. ఇది భవిష్యత్ లో మార్కెట్లో చేపల కొరతకు, ధరల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంది.
ఉమ్మడి పాలమూరులో నీటి వనరులు ఇలా
నాగర్ కర్నూల్ జిల్లాలో 4 రిజర్వాయర్లతో పాటు 134 చెరువులు ,1126 కుంటలు ఉన్నాయి. వనపర్తి జిల్లాలో 5 రిజర్వాయర్లు ఉండగా, 109 చెరువులు, 850 పైగా కుంటలు ఉన్నాయి. జోగులాంబ గద్వాలలో 6 నుంచి 16 రిజర్వాయర్లు ఉండగా, 38 చెరువులు, 396 కుంటలు ఉన్నాయి. మహబూబ్ నగర్ లో మూడు రిజర్వాయర్లుండగా, 140 చెరువులు, 900 కు పైగా కుంటలు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో రెండు రిజర్వాయర్లు ఉండగా 75 చెరువులు, 450 కి పైగా కుంటలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తంగా 27 రిజర్వాయర్లతో పాటు 436 చెరువులు, 3757 కుంటలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తెలియజేస్తున్నాయి.
చేపల వేట లేక..వలసబాట
చేపల వేట లేకపోవడంతో మత్స్యకారుల రోజువారీ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఎప్పుడూ బిజీగా ఉండే మత్స్యకార సొసైటీలు, రేవులు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. ఉపాధి కోల్పోయిన చాలా మంది మత్స్యకారులు ఉపాధికోసం మళ్లీ పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితులు వచ్చాయి.

