కలం, ఖమ్మం బ్యూరో : అఖిల భారత కిసాన్ మజ్దూర్ సభ 4వ అఖిల భారత మహాసభ (AIKMS Conference) ఖమ్మంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ (కామ్రేడ్ అజ్మీర్ సింగ్ హాల్)లో గురువారం రాత్రి విజయవంతంగా ముగిసింది. ఫాసిస్ట్ దాడులు, కార్పొరేట్ దోపిడీ, భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిస్తూ మహాసభ ముగిసింది. ఈ సందర్భంగా నూతన జాతీయ కమిటీని ఎన్నుకున్నారు. ఏఐకేఎంఎస్ నూతన జాతీయ అధ్యక్షుడిగా కామ్రేడ్ నిర్భయ్ సింగ్ దుడికే, ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ జె.వి. చలపతి రావును ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కామ్రేడ్స్ ఆశిష్ మిట్టల్, టి. సుధాకర్, కార్యదర్శులుగా బాలచంద్ర, రమీందర్ సింగ్, కోశాధికారిగా చిట్టిపాలు వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో ఎనిమిది మందిని సభ్యులుగా ఎన్నుకుని మొత్తం 15 మందితో జాతీయ కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేశారు.
వ్యవసాయం, మార్కెటింగ్ రంగాల నుంచి కార్పొరేట్ సంస్థలను దూరంగా ఉంచాలని నూతన నాయకులు పిలుపునిచ్చారు. జీవనాధార భూములు, అడవులు, నదులను కాపాడుకునేందుకు చిన్న, మధ్యతరహా రైతులు, వ్యవసాయ కార్మికులను ఏకం చేస్తామని స్పష్టం చేశారు. రైతులు, వ్యవసాయ కార్మికుల ఐక్యతకు ప్రతీకగా ఎరుపు, ఆకుపచ్చ రంగులతో నాగలి, కొడవలి చిహ్నాలు కలిగిన నూతన జెండాను మహాసభలో ఆమోదించారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి 17 కీలక తీర్మానాలను ఈ మహాసభలో ఆమోదించారు. C2+50 శాతం ప్రాతిపదికన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించడం, రైతులందరికీ రుణమాఫీ అమలు చేయడం, UAPA, NSA వంటి చట్టాలను రద్దు చేయడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకించడం, కెన్-బెట్వా నదుల అనుసంధానాన్ని నిలిపివేయడం, సీఈసీ జ్ఞానేష్ కుమార్ తొలగింపు తదితర డిమాండ్లపై భవిష్యత్ పోరాటాలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం అరుణోదయ బృందం ఆలపించిన కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ గీతంతో ఏఐకేఎంఎస్ 4వ అఖిల భారత మహాసభ ముగిసింది.

