కలం, జోగుళాంబ గద్వాల : గత వారం రోజుల నుంచి జూరాల ప్రాజెక్టులో నీరు (Jurala Project Water) పాచి రంగు మారడం కలకలం రేపుతోంది. నీరు రంగు మారడమే కాక, నదిలో చేపలు మృత్యువాత పడుతున్నాయంటూ.. మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో జూరాల డ్యాం వద్ద చేపల గిరాకీలు క్రమేణ తగ్గుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక కృష్ణానదికి ఆశించిన వరద ప్రవాహం లేకపోవడంతో తాగునీటి అవసరాల మేర జూరాల ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు ఉన్నాయి.
వరద ప్రవాహం లేకపోవడంతో జూరాలలో నీరు నిల్వ ఉండటంతో క్రమేణ రంగు మారిందని ఇరిగేషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే గత వారం రోజుల నుంచి ప్రాజెక్ట్ లో నీరు ఆకుపచ్చ రంగులోకి మారడమే కాకుండా, అందులోని చేపలు మృత్యువాత పడటంతో ప్రజలు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రాజెక్టులో నీరు ఎప్పుడు రంగు మారలేదని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల జూరాల ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రాజెక్ట్‌కు లోకి చేరిన వరద నీరు ఎక్కడైన కలుషితమై జూరాల ప్రాజెక్టుకు వస్తోందా లేక ఇతర కారణాల వల్ల నీరు కలుషితమైందా అనే విషయాన్ని అధికారులు తేల్చాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా జూరాల ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ ద్వారా జోగులాంబ గద్వాల జిల్లాతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోంది. మిషన్ భగీరథకు ద్వారా అందించే తాగు నీరులో ఎలాంటి రంగు కనిపించడంలేదని అధికారులు వెల్లడించారు. కృష్ణానది నీటిని ఫిల్టర్ చేసి సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, ప్రజలు మాత్రం ఆందోళనలోనే ఉన్నారు.
ఆందోళన అవసరం లేదు : జూరాల ఇరిగేషన్ డీఈఈ
జూరాల ప్రాజెక్ట్ జలాల్లో పైన పచ్చటి పొర (గ్రీనిష్ లేయర్) ఏర్పడినప్పటికీ, ప్రాజెక్ట్ దిగువన లభించే తాగునీరు సంపూర్ణంగా సురక్షితమని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జూరాల ప్రాజెక్టు ఇరిగేషన్ డీఇఇ నాగేశ్వర రావు స్పష్టం చేశారు. సాదారణంగా వరదల సమయంలో నారాయణపూర్ డ్యాం నుంచి దిగువన కృష్ణానదీలోకి నీటిని విడుదల చేయడంతో నదిలో నిరంతరం నీరు ప్రవహిస్తోంది. అయితే ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక నదిలో నీరు ప్రవహించకపోవడంతో పాటు నీళ్లు నిల్వ ఉండటంతో నీళ్ల రంగు మారే అవకాశం ఉందని తెలిపారు.

