కలం, కరీంనగర్ బ్యూరో: స్థానిక రెస్టారెంట్లతో పాటు పంపిణీ కేంద్రాల్లో ఆహార భద్రతా శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా మూతల వద్ద తుప్పు పట్టిన 200 మి.లీ. కూల్‌డ్రింక్ గాజు సీసాలను (Rusted Cool Drink) అధికారులు గుర్తించారు. పంపిణీ కేంద్రంలో ఉన్న మొత్తం 60 కేసుల తుప్పు పట్టిన సీసాల నిల్వను స్వాధీనం చేసుకున్నట్లు ఆహార భద్రతా శాఖ తెలిపింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం తదుపరి చర్యలు ప్రారంభించామని, వివరణ ఇవ్వాలని కోరుతూ సంబంధిత తయారీదారుకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
నకిలీ అధికారుల ముఠాపై మరొకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులుగా నటిస్తూ వ్యాపారులను, హాస్టల్ వార్డెన్లను బెదిరిస్తున్న ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని శాఖ హెచ్చరించింది. ఇటీవల తిమ్మాపూర్ లోని ఒక ప్రభుత్వ వసతి గృహ వార్డెన్‌కు 7842521329 నంబరు నుండి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అలాగే బేకరీలు, రెస్టారెంట్లలో అనధికారికంగా ప్రవేశించి ఫోటోలు తీస్తూ డబ్బులు డిమాండ్ చేసే నకిలీ వ్యక్తులను ప్రోత్సహించవద్దని సూచించారు. ఇటువంటి అనుమానాస్పద కాల్స్ లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పి. రోహిత్ రెడ్డి (7032087727) లేదా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వి. అంకిత్ రెడ్డి (9404893871) లను సంప్రదించాలని కరీంనగర్ జిల్లా ఆహార భద్రతా శాఖ విజ్ఞప్తి చేసింది.

