పాక్‌పై భారత్ థ్రిల్లింగ్ విజయం

కలం, స్పోర్ట్స్​ : ఆసియా గేమ్స్ పురుషుల హాకీ (Asian Games Hockey) సెమీఫైనల్లో భారత్ అద్భుత విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 4-3 తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. మ్యాచ్ మరో 45 సెకన్లలో ముగుస్తుందనగా అభిషేక్ సాధించిన గోల్ భారత్‌ను గెలిపించింది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఐదో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచాడు.

ఆ తర్వాత 13వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్‌ను కూడా ఆయనే గోల్‌గా మార్చి భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. 23వ నిమిషంలో షిలానంద్ లాక్రా అందించిన పాస్‌తో సుఖ్‌జీత్ సింగ్ మూడో గోల్ చేశాడు. దీంతో భారత్ 3-0తో బలంగా నిలిచింది. అయితే పాకిస్థాన్ నెమ్మదిగా పుంజుకుంది. మ్యాచ్ 30వ నిమిషంలో అబూ మహమూద్ పెనాల్టీ కార్నర్ ద్వారా పాక్‌కు మొదటి గోల్ అందించాడు. ద్వితీయార్థంలో పాక్ మరింత దూకుడు పెంచింది. 45వ నిమిషంలో హన్నాన్ షాహిద్ గోల్ చేయడంతో స్కోరు 2-3కి చేరింది.

49వ నిమిషంలో వహీద్ రానా గోల్ చేయడంతో మ్యాచ్ 3-3తో సమమైంది. షూటౌట్ ఖాయమని భావిస్తున్న వేళ భారత ఆటగాడు అభిషేక్ మెరిశాడు. ఆట ముగియడానికి కేవలం 45 సెకన్ల ముందు ఆయన కొట్టిన షాట్ ప్రత్యర్థి డిఫెండర్ సూఫియాన్‌ను తాకుతూ గోల్ పోస్ట్ లోపలికి వెళ్లింది. దీంతో భారత్ 4-3తో గెలుపొందింది. శనివారం జరగబోయే ఫైనల్లో మలేషియా, కొరియా మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. పాకిస్థాన్ కాంస్య పతకం కోసం పోటీపడుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>