కలం, ఖమ్మం బ్యూరో : నాలుగేళ్లుగా ప్రాణంగా ప్రేమించిన ఆ యువతి, కుటుంబ వివాదాల వల్ల పెళ్లికి “నో” చెప్పిందన్న ఒకే ఒక్క కారణంతో ఆ ప్రేమికుడు ఉన్మాదిగా మారాడు. బైక్ గేర్ వైర్‌తో మెడ బిగించి దారుణంగా ప్రాణాలు తీశాడు. ఆపై ఏమీ తెలియనట్లు పరారై, పోలీసుల కళ్లు గప్పి వేరే ప్రాంతంలో ర్యాపిడో డ్రైవర్‌గా తలదాచుకోవాలని పక్కా స్కెచ్ వేశాడు. అయితే, అనుమానాస్పద మృతిగా నమోదైన కేసును సవాలుగా తీసుకున్న కొత్తగూడెం పోలీసులు దర్యాప్తులో అసలు కథను బయటకు తీసి, నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జూలూరుపాడు (Julurupadu) పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి (18) హత్య కేసు(Harini Murder Case) వివరాలను కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ గురువారం మీడియాకు వెల్లడించారు.
ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం వెంగన్నపాలెం గ్రామంలోని తన నివాసంలో హరిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో హరిణిది సహజ మరణం కాదని, మెడను వైర్ వంటి వస్తువుతో బిగించి దారుణంగా హత్య చేసినట్లు తేలింది. దీంతో అధికారులు వెంటనే కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల లోతైన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హరిణి, దేవరకొండ పవన్ కుమార్ (22) గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ, ఇటీవల ఇరు కుటుంబాల మధ్య పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి.
ఈ క్రమంలో పవన్‌ను వివాహం చేసుకోవడానికి హరిణి నిరాకరించింది. తనకు దక్కదన్న కక్షతో, ఆ ఒక్క నిరాకరణను తట్టుకోలేక పవన్ కుమార్ ఆమెను గేర్ వైర్‌తో ఊపిరాడ నీయకుండా చేసి హతమార్చినట్లు తేలింది. హత్య చేసిన అనంతరం పవన్ పక్కా వ్యూహంతో పరారయ్యాడు. ఒంటిగూడిసె రోడ్‌లోని సీతారామ ప్రాజెక్టు కాలువ సమీపంలో దాచిపెట్టిన తన గ్లామర్ బైక్‌ను తీసుకుని సుదూర ప్రాంతానికి పారిపోవడానికి, అక్కడ ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తూ పోలీసులకు చిక్కకుండా జీవించడానికి ప్రయత్నించాడు. కాగా, పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన జూలూరుపాడు పోలీసు సిబ్బంది అతని స్కెచ్‌ను తిప్పికొడుతూ చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ద్విచక్ర వాహనంతో పాటు మృతురాలి ఫోన్, నిందితుడి ఫోన్, హత్యకు ఉపయోగించిన బైక్ గేర్ వైర్, ఆ సమయంలో అతడు ధరించిన షర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నామని, కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు.

