కలం, మహబూబ్ నగర్ బ్యూరో : సమాజంలోని పేదలు, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రెడ్‌క్రాస్ సొసైటీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) అన్నారు. జిల్లా రెడ్‌క్రాస్ ప్రధాన కార్యాలయంలో సోషల్ జస్టిస్, వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, రెడ్‌క్రాస్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా రక్తదానం (Blood Donation) చేసిన వారికి ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహబూబ్‌నగర్ రెడ్‌క్రాస్ సొసైటీకి నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. నూతన చైర్మన్, వైస్ చైర్మన్, ట్రెజరర్ సహా కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రెడ్‌క్రాస్ కార్యాలయం చిన్నదిగా, ఇరుకుగా ఉండటంతో సేవల విస్తరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా అత్యాధునిక వైద్య పరికరాలు, ఆధునిక డయాగ్నోస్టిక్ సేవలతో కూడిన నూతన భవన నిర్మాణాన్ని చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా, నామమాత్రపు ఖర్చుతోనే అన్ని రకాల వైద్య పరీక్షలు, చికిత్స అందేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రెడ్‌క్రాస్ వంటి సంస్థల సేవలను విస్తరించడానికి రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సేవా భావం ఉన్న ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని యెన్నం (MLA Yennam) పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కె ఎస్ రవికుమార్, వైస్ చైర్మన్ రామకృష్ణయ్య, ట్రెజరర్ జి.రమణయ్య తో పాటు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హుమన్ రైట్స్ కౌన్సిల్ కార్యదర్శి దివ్య జ్యోతి, మాజీ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్ నటరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Also Read : కాంగ్రెస్ అభ్యర్థులుగా ‘రెడ్డి’లకే ఛాన్స్.. స్పందించిన మల్లు రవి
Follow Us On: Instagram

