కలం, వెబ్ డెస్క్: రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులకే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించారన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటి చైర్మన్, ఎంపీ మల్లు రవి (Mallu Ravi) స్పందించారు. ఈ మేరకు గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చెప్పట్టిన తర్వాత ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు వస్తే మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌లకు ఇచ్చారని చెప్పారు. రెండోసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఎస్సీ సామజికవర్గానికి చెందిన అద్దంకి దయాకర్, ఎస్టీ కోటాలో శంకర్ నాయక్, బీసీ కోటాలో విజయశాంతికి ఇచ్చారని గుర్తు చేశారు.
రెండుసార్లు ఎన్నికలు వస్తే.. ఒక్క రెడ్డి సామజికవర్గానికి కూడా ఎమ్మెల్సీ ఇవ్వలేదని అన్నారు. ఇక గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉంటే.. ఒకటి మైనారిటీ నేత అజారుద్దీన్‌కి ఇస్తే.. మరొకటి తెలంగాణ ఉద్యమ నేత కోదండరామ్‌కు ఇచ్చారని తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ ఎంపీ సీటు ఇచ్చారని అన్నారు.
జెన్ జీని రేవంత్ రెడ్డి ఎప్పుడో గుర్తించారన్న మల్లు రవి.. ఇందులో భాగంగానే బల్మూరి వెంకట్, అనిల్ కుమార్ యాదవ్ లకు పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించామని మల్లు రవి అన్నారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జెన్ జీ తరఫున సామ రామ్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి గెలవాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు ఎలాంటి పోటీ లేకుండా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు ఇచ్చారని గుర్తుచేశారు.

