కలం డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీకి దూరంగా ఉన్న పదిమంది ఎమ్మెల్యేలలో ఇద్దరు (Defected MLAs) రాజీనామా చేయాలనుకున్నారా? పార్టీ ఫిరాయింపు నిందలను మోయడానికి వారు సిద్ధంగా లేరా?.. అందుకే గౌరవప్రదంగా రిజైన్ చేసి మళ్ళీ అదే నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారా?.. కానీ కార్యరూపం దాల్చకపోవడానికి పార్టీ పెద్దలు వారిద్దరినీ ‘వద్దు..’ అంటూ వారించడమే కారణమా?.. ఇలాంటి పలు ప్రశ్నలకు ఆ ఇద్దరిలో ఒక ఎమ్మెల్యే ‘ఔను’ అని సమాధానం ఇచ్చారు. ఇప్పటికిప్పుడు రాజీనామా చేయాలని అనుకుంటున్నానని, కానీ పార్టీ పెద్ద ఒకరు నిరాకరిస్తున్నందున స్వంత నిర్ణయం తీసుకోవడంలేదని వివరించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లో ఆయన ఈ కామెంట్ చేశారు.
విలువలకే ప్రాధాన్యం :
రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో తాను నేర్చుకున్న విలువలకు కట్టుబడి ఉండాలన్న ఆలోచనతోనే రాజీనామా చేయాలనుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తనపై నియోజకవర్గంలోగానీ, రాజకీయ పార్టీల్లోగానీ మచ్చ లేకుండా బతికానని గుర్తుచేశారు. ఒక్క నెగెటివ్ కూడా లేకుండా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని, ఫస్ట్ టైమ్ పార్టీ ఫిరాయింపు నిందను మోస్తున్నానని గుర్తుచేశారు. ప్రజల్లో తెచ్చుకున్న ఆ గుర్తింపుతోనే ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి పోటీ చేసినా మళ్ళీ గెలుస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు కూడా వివరించినట్లు తెలిపారు. రాజీనామా చేయాలన్న ప్రతిపాదనను వారికి తెలియజేశానని, కానీ ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ చేయడం పీసీసీ, ఏఐసీసీ పరిధిలోని అంశం కావడంతో ఇప్పటికిప్పుడు రిజిగ్నేషన్ వద్దంటూ వారించారని గుర్తుచేశారు.
ఉప ఎన్నికలపై కాంగ్రెస్ భిన్న వైఖరి :
ఉప ఎన్నికల్లో గెలుపు, ఓటమి సంగతి ఎలా ఉన్నా పార్టీ పూర్తిస్థాయిలో కేంద్రీకరించాల్సి ఉంటుందని, దానికి తగిన సమయాన్ని ఫైనల్ చేసుకున్న తర్వాతనే రిజిగ్నేషన్ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చంటూ పార్టీ పెద్ద ఒకరు వివరించినట్లు ఆ ఎమ్మెల్యే (Defected MLAs) వివరించారు. ఇప్పటివరకు జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినందున తన విషయంలోనూ అదే రిపీట్ అవుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కానీ అటు బీఆర్ఎస్‌గానీ, ఇటు కాంగ్రెస్‌గానీ పోటాపోటీగా గెలుపు కోసం సమయాన్ని, సర్వ శక్తుల్ని కేటాయించక తప్పదని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నందున దానికి ముగింపు పలికేలా రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి చూపించడమే ఉత్తమమని అన్నారు. కానీ పార్టీ పెద్ద ఒకరు వద్దు.. అంటూ వారిస్తున్నందున నిస్సహాయుడిగా ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. మరో ఎమ్మెల్యే ఆలోచన కూడా ఇలానే ఉన్నదని ఉదహరించారు.
Read Also: దేశంలో ప్రమాదకరంగా ‘వైట్‌కాలర్’ ఉగ్రవాదం: రాజ్‌నాథ్ సింగ్
Follow Us On: Pinterest


