కలం, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పేదల సొంతింటి కల నెరవేరింది. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను (Double-Bedroom Houses) ఎట్టకేలకు కాంగ్రెస్ హయాంలో లబ్ధిదారులకు అందజేశారు. గురువారం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్, ఎమ్మెల్సీ కుచుకుళ్ళ దామోదర్ రెడ్డి సమక్షంలో లక్కీ డీప్ ద్వారా అర్హులైన పేదలకు ఇండ్లను కేటాయించడం జరిగింది.
దీంతో ఇండ్లు పొందిన ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు తిమ్మాజీపేట పాండు, జయప్రకాష్ చారి అధికారులతో వాదనకు దిగగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే…నాగర్‌కర్నూల్ (nagarkurnool) మున్సిపాలిటీ పరిధిలోని బస్‌డిపో వెనుక బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 192 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు.
ఐతే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, నాటీ ప్రభుత్వం బిల్లుల పెండింగ్ వల్ల పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక MLA డాక్టర్ కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఇండ్ల పెండింగ్ పనుల మరమ్మతు చేపట్టి కేటాయించిన లబ్ధిదారులు నిర్మించుకునేలా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దరఖాస్తు స్వీకరించి అర్హుల ఎంపికకు మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
దీంతో పేదల్లో ఇండ్లపై ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో వచ్చిన దరఖాస్తులో అర్హులను గుర్తించి జాబితా తయారు చేశారు. చివరగా గురువారం ఫ్లాట్లను లబ్ధిదారులకు లక్కీ డ్రా ద్వారా కేటాయించారు. ప్లాట్లు పొందిన పేదలు సొంత డబ్బులతో చివరి దశలో ఉన్న పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వం ఈ డబ్బులను ప్లాట్లు పొందిన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ…అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు తాము చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పనులకు సహకరించాలని, ఎలాంటి రాజకీయ తప్పుడు ప్రచారాలకు గురికావద్దన్నారు. తాను, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నామన్నారు.
ఇటీవల భూగర్భ డ్రైనేజీ పరులకు 40 కోట్లు మంజూరు చేయించామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పక్కనే 12 కోట్లతో ఆధునిక బస్ స్టేషన్ నిర్మిసున్నం అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ…చివరి దశ పనులను లబ్ధిదారులు స్వయంగా చేయించుకుంటే, అందుకు సంబంధించిన నిధులను నేరుగా లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా తమ ఇళ్లలోకి చేరేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇళ్లకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, పిడి హౌసింగ్ గోపాల్ నాయక్, ఆర్డిఓ అర్చన, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, కౌన్సిలర్లు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

