‘SIR’ నిలిపివేయకుంటే దేశవ్యాప్త ఉద్యమం.. వామపక్షాల హెచ్చరిక!

కలం, నల్లగొండ: దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని వామపక్ష పార్టీలు (Left Parties) డిమాండ్ చేశాయి. పౌరుల ప్రజాస్వామ్య హక్కులను, ఓటు హక్కును పరిరక్షించాలని కోరుతూ గురువారం నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్), టీజీఎస్ తదితర పార్టీల ఆధ్వర్యంలో భారీ నిరసన (Protest) కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో పెద్ద ఎత్తున అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారని, నల్గొండ జిల్లాలో కూడా భారీ సంఖ్యలో ఓటర్లకు నోటీసులు ఇవ్వడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

ఓటర్ల జాబితా సవరణ విషయంలో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను ప్రాతిపదికగా తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఇటీవల కమిషన్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి, తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను వెంటనే తిరిగి జాబితాలో చేర్చాలన్నారు.

ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించాలని నాయకులు స్పష్టం చేశారు. లేనిపక్షంలో ప్రజాస్వామ్యవాదులు, లౌకిక శక్తులు, వామపక్ష పార్టీలన్నింటినీ కలుపుకొని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు హశం, సలీంతో పాటు పలు వామపక్ష పార్టీల ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>