కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో భారీ భూ కుంభకోణం (Rangareddy Land Scam) కలకలం రేపింది. మంగళ్ పల్లి గ్రామంలో ఉన్న రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఒక ప్రైవేటు వ్యక్తి పేరిట మార్చేశారు. మంగళ్ పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 96లో ఉన్న 4.25 ఎకరాల సర్కారు స్థలానికి వహీదా బేగం అనే ప్రైవేటు వ్యక్తి పేరుతో అధికారికంగా పట్టా పాసుపుస్తకం కూడా జారీ చేయడం అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ అక్రమం వెలుగులోకి రావడంతో రెవెన్యూ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి వెళ్లేలా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు ఎలా జరిగాయి, ఈ ఫోర్జరీ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో అధికారులు ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. భూమి స్వభావం, పాత రెవెన్యూ రికార్డుల రికవరీ, డిజిటల్ డేటా లాగిన్ అంశాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా పొందిన ఈ పట్టాను తక్షణమే రద్దు చేయాలని ఆదేశిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

