కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట కాంగ్రెస్ (Suryapet Congress) పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొన్నాళ్లుగా పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలు, వర్గపోరుకు అధిష్ఠానం వ్యూహాత్మకంగా చెక్ పెట్టింది. ఉమ్మడి నల్లగొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా దివంగత సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు, యువ నేత రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేరును పార్టీ అధిష్ఠానం అధికారికంగా ఖరారు చేసింది. దీంతో సూర్యాపేటలో కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ పటేల్ రమేష్ రెడ్డికి ఇక కన్ఫర్మ్ అయినట్టేనని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
తారస్థాయికి చేరిన వర్గ పోరు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో కాంగ్రెస్ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి పోటీ చేయగా, టికెట్ రాలేదనే అసంతృప్తితో పటేల్ రమేష్ రెడ్డి రెబల్‌గా బరిలోకి దిగారు. ఇద్దరి మధ్య ఓట్లు చీలిపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే దామోదర్ రెడ్డి అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఆ తర్వాత దామోదర్ రెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన తనయుడు సర్వోత్తమ్ రెడ్డి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుంటున్నారు.
తండ్రి పేరుతో దక్కే సానుభూతితో పాటు ద్వితీయ శ్రేణి నాయకత్వం, ఎక్కువ శాతం కేడర్ ఆయన వైపే నిలిచింది. మరోవైపు పటేల్ రమేష్ రెడ్డికి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కడంతో ఆయన సైతం నియోజక వర్గంలో వేగంగా పుంజుకున్నారు. దీంతో రాబోయే అసెంబ్లీ టికెట్ నాదంటే నాది అంటూ ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిపోగా, కేడర్ చీలిపోయే దాకా వెళ్లింది.
అధిష్ఠానం మాస్టర్ ప్లాన్…
సూర్యాపేటలో ఇద్దరు బలమైన నేతల మధ్య నడుస్తున్న పోరు రాబోయే రోజుల్లో పార్టీకి తీవ్రనష్టం కలిగిస్తుందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్ఠానం మాస్టర్ ప్లాన్ అమల్లోకి తెచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తమ్ రెడ్డిని బరిలోకి దింపడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపెట్టేసిందని చెప్పాలి. కాంగ్రెస్ కోసం దశాబ్దాల పాటు సేవలు అందించిన దామోదర్ రెడ్డి కుటుంబాన్ని గౌరవిస్తూ, ఆయన వారసుడిని పెద్దల సభకు వెళ్లే అవకాశం కల్పించడం ద్వారా ఆ వర్గాన్ని సంతృప్తి పరిచింది. సర్వోత్తమ్ రెడ్డికి రాష్ట్రస్థాయి ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడంతో, సూర్యాపేట అసెంబ్లీ సీటుపై పటేల్ రమేష్ రెడ్డికి ఉన్నఅడ్డంకి కూడా తొలగింది.
పేటలో గెలుపుపై స్కెచ్..
అధిష్ఠానం నిర్ణయంతో ఇటు సర్వోత్తమ్ రెడ్డి వర్గంలో అటు పటేల్ రమేష్ రెడ్డి వర్గంలో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. తమ నేతకు అసెంబ్లీ దారి సుగమమైందని రమేష్ రెడ్డి వర్గం, తమ నాయకుడికి ఎమ్మెల్సీ టికెట్ దక్కిందని సర్వోత్తమ్ రెడ్డి వర్గం సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు వర్గాలు ఎంతవరకు కలిసికట్టుగా పనిచేస్తాయనేదే ఇప్పుడు అసలైన పరీక్షగా నిలిచింది.
సూర్యాపేటలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నా.. బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డిని దీటుగా ఎదుర్కోవాలన్నా సర్వోత్తమ్ రెడ్డి ఎమ్మెల్సీ విజయంలో పటేల్ రమేష్ రెడ్డి వర్గం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఒకరికి ఎమ్మెల్సీ.. మరొకరికి అసెంబ్లీ అనే స్పష్టమైన ఫార్ములా వచ్చిన వేళ, ఈ ఇద్దరు నేతలు చేతులు కలిపితే సూర్యాపేట కాంగ్రెస్‌కు తిరుగుండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పటేల్‌కు టికెట్ ఖాయమైనట్టేనా..!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తమ్ రెడ్డి గెలుపోటములతో సంబంధం లేకుండా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి సూర్యాపేట సీటు పటేల్ రమేష్ రెడ్డికే దాదాపు ఖాయమైందనే అభిప్రాయం వినిపిస్తోంది. సూర్యాపేట టికెట్ పై సర్వోత్తమ్ రెడ్డి నుంచే రమేష్ రెడ్డికి తీవ్రమైన పోటీ ఎదురయ్యేది. ఇప్పుడు ఆయనను ఎమ్మెల్సీగా పంపడంతో స్థానికంగా రమేష్ రెడ్డికి మరే ఇతర బలమైన ప్రత్యర్థి లేకుండా పోయారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నందున రమేష్ రెడ్డి సెగ్మెంట్ లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి, శ్రేణులను ఏకం చేయడానికి తగిన సమయం లభించింది.

