కలం, స్పోర్ట్స్ : శ్రీలంకతో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (Pak vs Sri Lanka) కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. లంకతో అక్టోబర్ 9, 11, 13 తేదీల్లో రావల్పిండి వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం జట్టు నాయకత్వంతో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్ల భవితవ్యంపై బోర్డు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రస్తుత కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాను బాధ్యతల నుంచి తప్పించి, టీ20 జట్టు నుంచే తొలగించనున్నట్లు తెలుస్తోంది. అతను ఇకపై కేవలం వన్డే జట్టుకే పరిమితం కానున్నాడు.
అలాగే పేసర్ షాహీన్ షా అఫ్రిదిని కూడా టీ20ల నుంచి పక్కనబెట్టే అవకాశం ఉంది. అయితే అఫ్రిది వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగుతాడని సమాచారం. ఈ సిరీస్ (Pak vs Sri Lanka)కు షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్ తిరిగొచ్చే అవకాశం కనిపించడం లేదు. టీ20 కొత్త కెప్టెన్ రేసులో సాహిబ్‌జాదా ఫర్హాన్ ముందంజలో ఉన్నాడు. జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పాక్ జట్టును నడిపిస్తున్న ఫర్హాన్‌కే స్వదేశీ సిరీస్ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
షాదాబ్ ఖాన్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఫర్హాన్ వైపే యాజమాన్యం మొగ్గు చూపుతోంది. మరోవైపు టెస్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ టీ20, వన్డే జట్లలో కొనసాగనున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రాణించిన రజావుల్లాను కొత్త పేస్ ఆప్షన్‌గా రెండు పరిమిత ఓవర్ల జట్లలోకి తీసుకునేందుకు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మేనేజ్‌మెంట్ త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోనుంది.

