కలం, ఖమ్మం బ్యూరో : మన్య ప్రాంత రాజకీయ గడ్డ భద్రాచలంలో(Bhadrachalam) రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా, ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం, దానం నాగేందర్ ఉదంతం తర్వాత ఊపందుకున్న పరిణామాలు ఇప్పుడు భద్రాచలం స్థానాన్ని కుదిపేస్తున్నాయి. ఒకవైపు ప్రస్తుత ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై (Tellam Venkata Rao) ‘అనర్హత’ కత్తి వేలాడుతుంటే.. మరోవైపు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య(Podem Veeraiah) తీవ్ర అసంతృప్తితో గులాబీ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన తెల్లం వెంకట్రావు.. ఆ తదనంతరం అధికార కాంగ్రెస్ వైపు వచ్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు స్పీకర్‌ను ఆశ్రయించగా.. తనపై వచ్చిన ఆరోపణలపై స్పీకర్ విచారణ సందర్భంగా ‘తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నానని’ తెల్లం వెంకట్రావు వివరణ ఇవ్వడంతో స్పీకర్ ఆ ఫిర్యాదును కొట్టివేశారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేత వివేకానంద్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు నోటీసులు జారీ చేసింది.
ఈ విచారణలో తమ వాదనలు వినిపించేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ లీగల్ సెల్ కూడా ‘ఇంప్లీడ్ పిటిషన్’ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తుండటంతో న్యాయపోరాటం మరింత ఆసక్తికరంగా మారింది. దానం నాగేందర్ కాంగ్రెస్ బి-ఫామ్‌పై ఎంపీగా పోటీ చేసి దొరికిపోగా.. తెల్లం వెంకట్రావు సాంకేతికంగా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 6న మధ్యాహ్నం 2.15 గంటలకు జరగనున్న హైకోర్టు తదుపరి విచారణలో ఏం జరగబోతోందనేది తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా పట్టుకుని నిలబడిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పొదెం వీరయ్య వైఖరి నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. 2018లో పార్టీ నుంచి గెలిచిన మిగతా ఎమ్మెల్యేలంతా బీఆర్‌ఎస్‌లో చేరినా.. వీరయ్య మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ రెండు పర్యాయాలు డీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేశారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అధిష్ఠానం తనను తగిన రీతిలో గుర్తించలేదని, సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముఖ్య అనుచరులతో సమావేశమైన ఆయన.. బీఆర్‌ఎస్ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని, రాబోయే రోజుల్లో గులాబీ కండువా కప్పుకుని భద్రాచలం అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు భద్రాచలం అసెంబ్లీ స్థానం భవిష్యత్ రాజకీయాన్ని తీవ్ర క్లిష్టంగా మార్చేశాయి.

