రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే రీసర్వే : కలెక్టర్ ప్రియాంక

కలం, నారాయణపేట : రైతుల భూముల హక్కులు, సరిహద్దులు, విస్తీర్ణాన్ని స్పష్టంగా నమోదు చేసి భవిష్యత్ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే రీసర్వే చేపడుతున్నట్లు కలెక్టర్ ప్రియాంక (Narayanpet Collector Priyanka) తెలిపారు. నారాయణ పేట జిల్లా మాగనూరు మండలం గజరాందొడ్డి గ్రామంలో నిర్వహించిన రీసర్వే గ్రామసభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. దాదాపు వందేళ్ల తర్వాత ప్రభుత్వం భూముల రీసర్వే చేపడుతోందన్నారు. ప్రతి భూమికి భూధార్ నంబర్ కేటాయించి, ఎల్పీఎం ద్వారా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, అనంతరం రైతులకు పాస్‌బుక్‌లు అందిస్తామని ఆమె తెలిపారు.

భూముల సరిహద్దులు, రికార్డులు, విస్తీర్ణంలో ఉన్న తేడాలను పరిశీలించి స్పష్టమైన నమోదు చేస్తామని చెప్పారు. రీసర్వే ద్వారా ఎవరి భూమిని తగ్గించడం లేదా పెంచడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్​ స్పష్టం చేశారు. రైతులు సర్వేయర్లు గ్రామానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండి తమ భూముల సరిహద్దులను చూపించాలని ఆమె కోరారు. గజరాందొడ్డిలో సుమారు 450 ఎకరాల భూమి ఉన్నందున రోజుకు 30 ఎకరాల చొప్పున 15 నుంచి 20 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి సర్వే నంబర్‌కు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, సర్వే తేదీలను రైతులకు ముందుగానే తెలియజేయాలని సూచించారు. రీసర్వే అనంతరం రైతుల సమక్షంలో భూమి విస్తీర్ణం, సరిహద్దులు, నమోదైన వివరాలను స్పష్టంగా వివరించాలని తెలిపారు. రైతులకు సమస్యలు లేదా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, త్వరలో ఏర్పాటు చేయనున్న టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ ప్రియాంక (Narayanpet Collector) సూచించారు.

రీసర్వే విజయవంతానికి రైతులు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని కోరారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ ఎం.రాములు, తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్, ఎంపీడీవో, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>