కలం, యాదాద్రి భువనగిరి: పోచంపల్లి చేనేత కళ, స్థానిక సంస్కృతి, ఆహారపు ప్రత్యేకతలు, జీవన విధానం, ప్రకృతి అందాలను దేశ, విదేశీ పర్యాటకులకు పరిచయం చేసేలా పర్యాటక కార్యక్రమాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Collector Anuraag Jayanti) అన్నారు. బుధవారం పోచంపల్లి పట్టణంలోని టూరిజం పార్క్‌ను కలెక్టర్ సందర్శించి, ‘ఎక్స్‌పీరియన్స్ పోచంపల్లి’ (Experience Pochampally) కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన టూరిజం గైడ్స్, చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోచంపల్లి పర్యాటక అభివృద్ధికి ‘ఎక్స్‌పీరియన్స్ పోచంపల్లి’ కార్యక్రమాన్ని రూపొందించి, దేశ, విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యాటకులకు పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల తయారీ విధానం, చేనేత కార్మికుల నైపుణ్యం, స్థానిక ఆహారపు ప్రత్యేకతలు, సంస్కృతి, జీవన విధానంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా పరిచయం చేసే కార్యక్రమాలను రూపొందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, చేనేత కార్మికులు తయారు చేసే ఇక్కత్ వస్త్రాలకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. తద్వారా పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉందన్నారు. అనంతరం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికుల కోసం నిర్వహించిన ప్రత్యేక ఆరోగ్య శిబిరాల్లో కంటి సమస్యలు గుర్తించిన వారికి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశం, పోచంపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షులు భారత లవకుమార్, రోటరీ క్లబ్ ప్రతినిధులు, చేనేత, జౌళి శాఖ సిబ్బంది, టూరిజం గైడ్స్, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

