వాలిడేషన్ యాక్ట్‌కు వ్యతిరేకంగా పెన్షనర్ల పోరుబాట

కలం, ఖమ్మం బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లు పేరుతో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ‘వాలిడేషన్ యాక్ట్ 2025’ను (Validation Act 2025) వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరం పెన్షనర్ల (Pensioners) మహా ధర్నాతో హోరెత్తింది. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద విశ్రాంత ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు.

ఎల్. గోపీచంద్ అధ్యక్షతన జరిగిన ధర్నా శిబిరాన్ని STFI ప్రధాన కార్యదర్శి, UTF రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ప్రారంభించి మాట్లాడారు. పెన్షన్ రివిజన్, పెరుగుదల లేకుండా కేంద్రం తీసుకొచ్చిన వాలిడేషన్ యాక్ట్ 2025 పెన్షనర్ల హక్కులను దెబ్బతీస్తోందని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ (CPS)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 8వ వేతన సంఘం సిఫార్సులను 1-1-2026 కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లకు కూడా వర్తింపజేయాలని కోరారు. కమ్యూటేషన్ రికవరీని 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గించాలని, అన్ని రాష్ట్రాల్లో కామన్ డీఆర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉచిత వైద్య బీమా, బస్సు, రైలు, విమాన ప్రయాణ చార్జీల్లో 50 శాతం రాయితీ కల్పించాలని కోరారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించవద్దని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ప్రభుత్వం నిలిచిపోయిన 6 డీఏలను తక్షణమే విడుదల చేయాలని, నూతన పీఆర్సీ నివేదిక తెప్పించి మెరుగైన ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. హెల్త్ కార్డులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ధర్నా అనంతరం పెన్షనర్లు కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానమంత్రికి పంపించాలని కోరుతూ అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, టీజీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి మోదుగు వేలాద్రితో పాటు దాదాపు 150 మంది పెన్షనర్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>