కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు ప్రస్తుతం తీవ్రమైన విద్యుత్ కోతలు, సాగునీటి కొరత కారణంగా సంక్షోభాన్ని (Agriculture Crisis) ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వర్షాభావ పరిస్థితులు, అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరా వల్ల వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రాజెక్టులకు వరద నీరు రాకపోవడంతో రైతులు పూర్తిగా బోరు బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేశారు. కానీ, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వారిని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాధారణ సాగు 21.32 లక్షల ఎకరాలు కాగా వర్షాభావ పరిస్థితుల కారణంగా 16.61 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. అయినా వర్షాలు సరిగ్గా లేకపోవడంతో పత్తి, వరి, మొక్కజొన్న, వేరుశెనగ పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం 457.6 మిల్లీమీటర్లు కాగా, సెప్టెంబర్ నాటికి 311.5 మిల్లీమీటర్లు నమోదైనట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. పాలమూరు జిల్లాలో సాధారణ సాగు 3,45,913 ఎకరాలు కాగా, 2,92,313 ఎకరాలు మాత్రమే సాగు చేశారు. అయినా పంటలు చేతికొచ్చే స్థితిలో లేవంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతన్నల బాధ వర్ణనాతీతం
గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దశలో (Agriculture Crisis) ఉండడం చూసి రైతన్నల బాధ వర్ణనాతీతంగా మారింది. ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 40 శాతం పంట నష్టం వాటిల్లినట్లు అంచనాలు తెలియజేస్తున్నాయి. కృష్ణా నది పక్కనే పారుతున్నా, సాగునీరు అందక గద్వాల వంటి ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల విత్తనాలు సగం మాత్రమే మొలకెత్తాయి, మొలకెత్తిన పంటలు కూడా నీరు లేక గిడసబారిపోతున్నాయి. కొన్నిచోట్ల ఏపుగా పెరిగిన పూత, కాయ లేకుండా ఉన్నాయి.
ఉన్న పంటలను కాపాడుకుందాం అంటే కరెంటు సరిగా రావడం లేదంటూ అన్నదాతలు రోడ్లెక్కిన పరిస్థితులు జిల్లాలో అనేకం జరిగాయి. సమస్య కేవలం కరెంట్ లేకపోవడం మాత్రమే కాదు, సరఫరాలో నాణ్యత లేకపోవడం కూడా అన్నదాతల ఆగ్రహానికి కారణమైంది. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అటు ఉంచితే, నిర్ణీత సమయాల్లో కూడా కరెంట్ ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా సాయంత్రం 7 గంటల తర్వాత కేవలం సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రమే ఇస్తున్నారని, త్రీ-ఫేజ్ సరఫరాలో కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
లో-వోల్టేజీ సమస్య కారణంగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోతుండడతో అదనపు ఆర్థిక భారాన్ని కలిగిస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు రాత్రంతా పొలాల వద్దే జాగారం చేయాల్సి దుర్భర పరిస్థితులు మళ్లీ తలెత్తాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.
రోడ్లెక్కిన పట్టించుకోని అధికారులు..!
కరెంట్ కోతలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మల్దకల్, భూత్పూర్, తాండ్ర గేట్, మక్తల్ తదితర ప్రాంతాల్లో రైతులు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు, ప్రధాన రహదారులపై రాస్తారోకోలు నిర్వహించిన ఫలితం లేకుండా పోయిందంటున్నారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం, కాలిపోయిన మోటార్లకు పరిహారం ఇవ్వాలనీ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ప్రాజెక్టుల్లో నీరు ఉన్నప్పటికీ నిర్వహణ లోపం వల్ల రైతులకు నీరు అందడం లేదని, కరెంట్ కోతలు కృత్రిమ కరువును సృష్టిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తంగా, ప్రకృతి వైపరీత్యానికి తోడు విద్యుత్ కోతలు తోడవడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పంటలు చేతికొచ్చే సమయంలో నీరు అందక కళ్లెదుటే పంట ఎండిపోతుంటే రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
Also Read : ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఉత్తమ్ అసంతృప్తి? ..కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ
Follow Us On: X(Twitter)

