జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని ఎమ్మెల్సీ సత్యం డిమాండ్

కలం, నల్లగొండ : రాజ్యాంగం కల్పించిన పౌరుల ఓటు హక్కు పరిరక్షణలో కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని, సర్ (SIR) ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (MLC Nellikanti Satyam) డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడటంతో పాటు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను బాధ్యతల నుంచి తొలగించాలని కోరారు.

బుధవారం నల్లగొండలోని సీపీఐ జిల్లా కార్యాలయం మగ్దుమ్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, దాన్ని ఏ నెపంతోనూ అన్యాయంగా హరించరాదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందనే అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయని నాయకులు ఆరోపించారు.

గతంలో పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఓట్లను తొలగించడం ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందిందని సత్యం విమర్శించారు. తెలంగాణలో సర్ ప్రక్రియ పేరుతో భారీ సంఖ్యలో ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారని, ఒక్క నల్లగొండ జిల్లాలోనే సుమారు 2 లక్షల మంది ఓటర్లపై విచారణ సాగుతోందని తెలిపారు. తమ సమాచారం ప్రకారం ఇప్పటికే 45 వేల మందికి నోటీసులు అందగా, మిగిలిన వారికి నోటీసులు అందక ప్రజలు తీవ్ర అయోమయానికి, ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల సంఘం వైఖరిని నిరసిస్తూ అక్టోబర్ 1న నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ సెంటర్‌లో వామపక్షాలు, ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల ఆధ్వర్యంలో మహా నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లొడంగి శ్రవణ్ కుమార్, సీపీఎం జిల్లా నాయకులు హషం, పుచ్చాకాయల నర్సిరెడ్డి, నల్పరాజు సైదులు, టీజేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, టి. వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి కేఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్, బీఆర్ఎస్ దొంగ నాటకాలను తిప్పికొడతాం: బండి సంజయ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>