కలం, వెబ్‌డెస్క్: విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నేడు నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) పాల్గొన్నారు. ఈ సభా ప్రాంగణంలో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. సభ జరుగుతుండగానే పల్లె పండుగ ప్రాంతం దగ్గర ఒక సోడా గ్యాస్ సిలిండర్ పేలి భారీ శబ్దం వచ్చింది. ఈ సిలిండర్ సుమారు 60 మీటర్ల దూరం ఎగిరిపడి కరెంట్ వైర్లపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సీఎం చంద్రబాబు ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే పరిస్థితిని సమీక్షించి తగు చర్యలు చేపట్టారు.
ఈ వేడుకలో విజయవాడలో 26 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్ జెట్ స్పీడ్‌తో ముందుకు వెళ్తోందని, పేదలంతా ఆనందంగా ఉంటేనే నిజమైన అభివృద్ధి అని, అదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సభా వేదిక వద్ద ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. సభకు హాజరైన వాళ్లంతా “థ్యాంక్యూ సీఎం సార్” అనే ప్లకార్డులను పెద్ద ఎత్తున ప్రదర్శించారు. దీనిపై ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.

