అడుగడుగునా జలకళ.. రైతన్నల సాగు కష్టాలకు చెక్!

కలం, ఖమ్మం బ్యూరో: తుమ్మల చెరువు ఆయకట్టు పరిధిలో అడుగడుగునా జలకళ సంతరించుకుంది. భద్రాద్రి జిల్లా పినపాక నియోజకవర్గంలో గోదావరి జలాల పారవశ్యం తోడుకాగా, ఏళ్లుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతన్నల కష్టాలకు శాశ్వతంగా చెక్ పడింది. అశ్వాపురం మండలంలోని మారెళ్ళపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోసిన గోదావరి నీటిని తుమ్మల చెరువు నుంచి తూముల ద్వారా పొలాలకు మళ్ళించే మహత్తర ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది.

పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు (Payam Venkateshwarlu) స్వయంగా తుమ్మల చెరువు వద్ద తూముల లాకులను తెరిచి, కాలువల గుండా పంట పొలాలకు నీటిని విడుదల చేశారు.​ ఈ సందర్భంగా తుమ్మల చెరువు వద్ద గోదావరి నీరు పరవళ్లు తొక్కుతుండటంతో ఆయకట్టు ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. మారెళ్ళపాడు లిఫ్ట్ ద్వారా నీటిని ఎత్తిపోసి, అక్కడ నుంచి తూముల ద్వారా ఆయకట్టు చివరి పొలాల వరకు నీరు చేరేలా చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే దగ్గరుండి సమగ్రంగా పరిశీలించారు.

​అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు వేళకు సాగునీరు అందించి పంటలను కాపాడడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని తెలిపారు. మారెళ్ళపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి నీటిని అందుబాటులోకి తీసుకురావడం వల్ల రైతుల్లో పంటల సాగుపై కొండంత ధీమా పెరిగిందన్నారు.ప్రతి ఎకరానికి సక్రమంగా నీరందేలా చూడాలని, ఎలాంటి నీటి వ్యర్థం కాకుండా కాలువలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ​

గోదావరి జలాలు తమ పొలాలను తడవడంతో ఆయకట్టు పరిధిలోని రైతులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, వివిధ స్థాయిల స్థానిక నాయకులు, మహిళా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>