కలం, వెబ్ డెస్క్ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు (Vijayawada Dasara Navaratri ) అక్టోబర్ 11 నుంచి 20 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆలయ ధర్మకర్తల మండలి ప్రతినిధులు, ఈఓ, అలాగే వైదిక కమిటీ సభ్యులు అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబుకు అధికారికంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 16న మూలానక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాలని కోరగా, సీఎం దానికి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులు, ఉత్సవ ప్రణాళికపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. నవరాత్రులకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్త్రృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
కాగా, ఈ ఏడాది పది రోజుల పాటు సాగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ వారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజైన అక్టోబర్ 11న శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిగాను, అక్టోబర్ 16న మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవి రూపంలోనూ ప్రసన్నులు కానున్నారు. అక్టోబర్ 20న విజయదశమి పర్వదినాన కృష్ణా నదిలో జరిగే హంసవాహనం తెప్పోత్సవంతో ఈ వేడుకలు ముగుస్తాయి.

