కలం, ఖమ్మం బ్యూరో : భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, తరతరాల అనుబంధాలకు ఆ పాఠశాల వేదికైంది. అనురాగానికి ఆప్యాయత తోడై బడి ఆవరణమంతా బంధాల పండుగను తలపించింది. సీనియర్ సిటిజెన్ వారోత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ (Sujathanagar) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అత్యంత భావోద్వేగభరితంగా సాగింది. ఈ వేడుకలో విద్యార్థులు తమ తాత, అమ్మమ్మ, నానమ్మలతో పాటు తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆహ్వానించి భక్తిశ్రద్ధలతో పాదపూజ చేశారు. పసి హృదయాలు చూపించిన గౌరవం, వినమ్ర ప్రణామాలకు పెద్దలు పరవశించిపోయారు. మనుమళ్లు, మనుమరాళ్లు ప్రేమతో కాళ్లు కడిగి ఆశీస్సులు తీసుకుంటుండగా.. ఆనంద భాష్పాలతో వారిని గుండెలకు హత్తుకున్నారు.
వృద్ధుల పట్ల గౌరవం, సేవాభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలను ఎల్లవేళలా గౌరవిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ ఇంటిలోని పెద్దలకు అండగా ఉంటామని విద్యార్థులు ప్రమాణం చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు విశేషంగా పాల్గొన్నారు.

