క్రిటికల్ కేర్ సెంటర్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం: రితేష్ రాథోడ్

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ సెంటర్‌ను పూర్తిస్థాయిలో ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఆరోపించారు. కేంద్రం నిర్మల్ ప్రజల కోసం సుమారు రూ. 23.74 కోట్లతో మంజూరు చేసిన ఈ క్రిటికల్ కేర్ సెంటర్ భవన నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ, అవసరమైన వైద్య పరికరాలు, ఫర్నిచర్, సిబ్బందిని సమకూర్చడంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.

బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం ప్రత్యేక చొరవ తీసుకుని క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణ పనులను వేగవంతం చేయించారని తెలిపారు. కేంద్రం నుంచి అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ, సుమారు రూ.10 కోట్ల విలువైన ఫర్నిచర్, అత్యవసర వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదన్నారు.

భవనం సిద్ధంగా ఉన్నా వైద్య పరికరాలు, సిబ్బంది లేకపోతే ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. ఆసుపత్రి ప్రారంభోత్సవ తేదీ నిర్ణయించడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని, అధికార యంత్రాంగం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నందునా ప్రారంభంలో జాప్యానికి ఎమ్మెల్యేను బాధ్యుడిని చేయడం సరికాదన్నారు.

మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మహేశ్వర్‌ రెడ్డిపై ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ విమర్శలకు తావివ్వకుండా కేంద్రం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుని అవసరమైన పరికరాలు, ఫర్నిచర్, సిబ్బందిని సమకూర్చి క్రిటికల్ కేర్ సెంటర్‌ను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రితేష్ రాథోడ్ డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>