కేంద్రం, రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్ దుష్ప్రచారం: సునీల్ రావు

కలం, కరీంనగర్: కేంద్రం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పనులకు, దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదగిరి సునీల్ రావు పాల్గొని మాట్లాడారు.

గత వారం రోజులుగా ఏదో ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను అభిశంసించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడం అత్యంత హేయమైన చర్య అని సునీల్ రావు (Yadagiri Sunil Rao) ఫైర్ అయ్యారు. సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి ఆధారరహిత ఆరోపణలు చేస్తూ వ్యవస్థల ప్రతిష్టను దిగజారుస్తోందని మండిపడ్డారు.

బీజేపీని నిరంతరం ఆదరిస్తున్నారు..

సీఈసీ జ్ఞానేష్ కుమార్ 2025 ఫిబ్రవరి నెలలోనే బాధ్యతలు స్వీకరించగా.. అంతకుముందు జరిగిన అనేక ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించిన సత్యాన్ని కాంగ్రెస్ విస్మరిస్తోందని పేర్కొన్నారు. దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వాన్ని విశ్వసించి బీజేపీని నిరంతరం ఆదరిస్తున్నారని తెలిపారు.

సర్ పై బురదజల్లే ప్రయత్నం..

గతంలో ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలే కారణమని ప్రచారం చేసిన కాంగ్రెస్.. ప్రజలు ఆ మాటలను నమ్మకపోవడంతో ఇప్పుడు ఎస్ఎస్ఆర్ ప్రక్రియపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని సునీల్ రావు అన్నారు. చట్టబద్ధంగా ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాల్సిన ఎస్ఎస్ఆర్ (SIR) ప్రక్రియను రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్ చేపడుతుందని చెప్పారు. ఎన్నికల కమిషన్‌లో ఉన్న ముగ్గురు కమిషనర్లు సమావేశమై, సుదీర్ఘంగా చర్చించిన పిమ్మట ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించి ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారని తెలిపారు.

ఆ చరిత్ర కాంగ్రెస్ పార్టీది..

ఎస్ఎస్ఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, తమిళనాడులోనూ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సునీల్ రావు గుర్తు చేశారు. ఒకవేళ కమిషన్ బీజేపీకి సహకరిస్తే ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఎలా గెలుస్తాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తన హయాంలో ఎన్నికల కమిషన్‌ను, రాజ్యాంగ పదవులను స్వప్రయోజనాల కోసం ఏ విధంగా వాడుకుందో దేశ ప్రజలకు స్పష్టంగా తెలుసని.. గతంలో సీఈసీగా పనిచేసిన ఎం.ఎస్. గిల్ వంటి అధికారులను తమ పార్టీలో చేర్చుకుని, ఆ తదనంతరం వారికి ఎంపీ, కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టి ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదిని ధ్వజమెత్తారు.

సమర్థవంతంగా ఈసీ పనిచేస్తోంది..

బీజేపీ ఎన్నడూ రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేయలేదని, ఆ సంస్కృతి బీజేపీకి లేదని సునీల్ రావు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఓటర్లను నేరుగా కలిసి, పత్రాలను పరిశీలించిన తర్వాతే ఓటర్ల జాబితా నమోదు, సవరణలు చేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి వివాదాలు లేదా సమస్యలు లేవని చెప్పారు. కేవలం పట్టణ ప్రాంతాల్లో ప్రజలు నగరాలు, గ్రామాలు రెండింటిలోనూ నివసిస్తుండటంతో కొంత సమస్య తలెత్తుతోందని, భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక పౌరుడికి ఒకే ప్రాంతంలో ఓటు హక్కు ఉండాలి కాబట్టి, ఆ దిశగా ఎన్నికల కమిషన్ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తోందని తెలియజేశారు.

దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతున్న కాంగ్రెస్..

కాంగ్రెస్ పార్టీ నిన్న ఈవీఎంలు, నేడు ఎస్ఎస్ఆర్, రేపు రాముడు-శివుడు అంటూ దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని సునీల్ రావు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో స్థానిక దేవుళ్ల పేర్లతో ప్రమాణాలు చేసే కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు రాముడిని, శివుడిని వేరుచేస్తూ మాట్లాడటం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. మన శాస్త్రాలు, పండితులు “శివాయ విష్ణు రూపాయ.. విష్ణు రూపాయ శివవే” అని స్పష్టంగా చెప్పారని.. రాముడు, శివుడు వేర్వేరు కాదని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో బీజేపీకే మద్దతు..

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కాశీ విశ్వనాథ్ ధామ్‌ను పునర్నిర్మించి, హిందూ ధర్మ విశ్వాసాలను, ఆలయ వైభవాన్ని పునరుద్ధరించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు, చౌకబారు వ్యూహాలు పన్నినా ప్రజలు నరేంద్ర మోదీ వైపే ఉన్నారని, రాబోయే రోజుల్లో కూడా బీజేపీకే మద్దతు తెలుపుతారని పునరుద్ఘాటించారు.

ఈ విలేకరుల సమావేశంలో పార్టీ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు బండారి వేణు, బండ రమణా రెడ్డి, మేకల వెంకటేష్, భూపతి రవీందర్, రామన్, నాంపల్లి శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, దేవసాని సత్యనారాయణ, సర్దార్ బల్విందర్ సింగ్, మహమ్మద్ ముజీబ్, పండుగ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>