కలం, ఆదిలాబాద్ : వాటర్ ప్లాంట్ యజమానులు నీటి వృధాను అరికట్టేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Adilabad Collector Rajarshi Shah) అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో నీటి వినియోగంపై మినరల్ వాటర్ ప్లాంట్ యజమానులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన భూగర్భ జలాల అక్రమ తవ్వకం, నీటి వృధాను అరికట్టడం, ప్లాంట్ల నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూగర్భ జలాలు విపరీతంగా అడుగంటుతున్న నేపథ్యంలో ప్లాంట్ల నిర్వహణదారులు తక్షణమే అప్రమత్తం కావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ బోర్‌వెల్స్ చుట్టూ విధిగా రీచార్జ్ స్ట్రక్చర్స్ లేదా కమ్యూనిటీ సోక్‌పిట్స్ ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా వృధా అయ్యే నీటిని తిరిగి భూగర్భంలోకి మళ్లించడానికి వీలవుతుందని రాజర్షి షా (Adilabad Collector Rajarshi Shah) స్పష్టం చేశారు. ప్లాంట్లు నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో నీటి నమూనా (సాంపిల్స్) పరీక్షలు విధిగా జరిపించుకోవాలని ఆదేశించారు.
అలాగే ట్రేడ్ లైసెన్సులు, మున్సిపల్ అనుమతులు లేని వారు వెంటనే వాటిని రెన్యువల్ చేసుకోవాలన్నారు. అదేవిధంగా నూతన వాటర్ ప్లాంట్లను పట్టణం బయట మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీటి సంరక్షణకు జల సంచాయ్ జన్ బాగీధారి, జలసిరి వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నాయని, నీటి వృధాను అరికట్టడంలో వ్యాపార యజమానులు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు.

