కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లను (Cotton Purchase) పారదర్శకంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్ల ముందస్తు ఏర్పాట్లపై మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, సీసీఐ ప్రతినిధులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, రైతు సంఘాల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Rajarshi Shah) మాట్లాడుతూ.. అక్టోబర్ రెండో వారంలో సీసీఐ, ప్రైవేట్ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జిన్నింగ్ మిల్లుల వివరాలను యాప్‌లో నమోదు చేసి, రైతులను సంబంధిత మిల్లులకు ట్యాగింగ్ చేసే ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, నీడ, తూకం తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
పత్తి కొనుగోలు కేంద్రాల్లో మాయిశ్చర్ మీటర్లను సక్రమంగా వినియోగించేలా వీఓలు, గ్రేడర్లు, సీసీఐ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. రైతులు, వీఓలు, గ్రేడర్లతో స్థానిక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసి తేమ శాతం కొలతల్లో పారదర్శకత పాటించాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి వ్యవసాయ, మార్కెటింగ్, సీసీఐ అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పత్తి రవాణాకు సంబంధించి ఆర్అండ్బీ, జాతీయ రహదారులు, గ్రామపంచాయతీ రహదారుల పరిస్థితిని సమీక్షించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
మార్కెట్ యార్డుల్లో తూకం, షెడ్లు, నీరు తదితర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, ఉట్నూర్ సబ్ కలెక్టర్ కొయ్యాడ ప్రణయ్ కుమార్, మార్కెటింగ్ ఏడీ గజానంద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, సీసీఐ బ్రాంచ్ మేనేజర్ పునీత, డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, కమిషన్ ఏజెంట్లు, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు, రైతు సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

