కలం, వనపర్తి: మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) తెలిపారు. మంగళవారం వనపర్తి (Wanaparthy) కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓటర్ల జాబితా నోటిఫికేషన్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో ఓటరుగా నమోదు అయి ఉన్నప్పటికీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఫారం-18 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 2026 నవంబరు 1 నాటికి మూడు సంవత్సరాల కంటే ముందే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు మాత్రమే ఓటరుగా నమోదు (Graduate Voter Registration) చేసుకునేందుకు అర్హులని తెలిపారు.
నవంబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరణ
అర్హులైన పట్టభద్రులు నవంబరు 6లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తుల పరిశీలనలో భాగంగా అధికారులు ఇంటింటికీ వెళ్లి భౌతికంగా వివరాలను పరిశీలిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా చిరునామా ధ్రువీకరణ పత్రం, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుందన్నారు.
నవంబరు 25న ముసాయిదా జాబితా
అర్హులైన ఓటర్లతో కూడిన ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబరు 25న విడుదల చేస్తామని తెలిపారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకు స్వీకరిస్తామని, వాటిని డిసెంబరు 25లోగా పరిష్కరిస్తామని చెప్పారు. డిసెంబరు 31న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వనపర్తి జిల్లాలోని అర్హులైన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు పోస్టు ద్వారా లేదా స్వయంగా సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో గడువులోగా సమర్పించాలని సూచించారు.

