కలం, వెబ్ డెస్క్: త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా భారీ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించగా.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ ప్రస్తుతం ఆదర్శ కుటుంబం ఏకే 47 మూవీ రిలీజ్ బిజీలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మూవీ స్క్రిప్ట్ పూర్తయిపోయిందని.. టైటిల్ మాత్రం ఇంకా ఖరారు చేయలేదన్నారు. దీంతో, మరోసారి ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్టుపై చర్చ ప్రారంభమైంది. పౌరాణిక నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి గాడ్ ఆఫ్ వార్, దేవ సేనాపతి అనే రెండు టైటిళ్లను త్రివిక్రమ్ రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. దేవ సేనాధిపతి కుమారస్వామి పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్.
విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా..
త్రివిక్రమ్ ఇప్పటివరకు రూపొందించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఎన్టీఆర్‌తో కొత్త మూవీని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా పౌరాణిక పాత్రలను తీర్చిదిద్దబోతున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రం చేస్తున్నారు. ఇది పూర్తయిన తరువాతే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుంది. అంటే వచ్చే ఏడాదే పూర్తి స్థాయిలో షూటింగ్ జరపుకోనుంది. 2018లో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు దాన్ని మించేలా స్క్రిప్ట్‌ను త్రివిక్రమ్ సిద్ధం చేశారని టాక్. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు.

