కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) పిలుపునిచ్చారు. మంగళవారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్‌నగర్ (Mahabubnagar) లో మాజీ మంత్రి తన ఇద్దరు కూతుర్లు శ్రీహిత, శ్రీహర్షితతో కలిసి ఓటరుగా నమోదు చేసుకున్నారు.
మళ్లీ ఓటరు నమోదు తప్పనిసరి
ఈ సందర్భంగా అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 2023 కంటే ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో ఓటు వేశాము కాబట్టి ఇప్పుడు మళ్లీ నమోదు అవసరం లేదని భావించి ఓటు వేసే అర్హత కోల్పో వద్దన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, ఎన్నికల్లో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులైన అర్హులైన పట్టభద్రులను కూడా ఓటరుగా నమోదు చేయించాలనీ గుర్తు చేశారు. ఎన్నికలు జరగనున్న ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లోని అర్హులైన పట్టభద్రులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి ఓటరు నమోదును చేసుకోవాలని కోరారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో యువతకు సహకరించాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

