డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం.. యువత భవిష్యత్ రక్షణే లక్ష్యం: తెలంగాణ ఈగల్ ఫోర్స్

కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల్ (Gadwal) జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ఈగల్ ఫోర్స్ (Telangana Eagle Force) ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ, నివారణ చర్యలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టడం, డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాను అరికట్టడం, నషా ముక్త్ భారత్ లక్ష్య సాధన దిశగా పోలీస్ శాఖతో పాటు అన్ని వర్గాలను భాగస్వామ్యాన్ని పెంచడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

పోలీసులు సమన్వయంతో పనిచేయాలి

ఈ సందర్భంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు ఎస్పీ పీవీ పద్మజ మాట్లాడుతూ.. డ్రగ్స్ సమస్యను కేవలం పోలీసింగ్ అంశంగా కాకుండా భవిష్యత్ తరాల భద్రతకు సంబంధించిన సామాజిక బాధ్యతగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించేందుకు అందుబాటులో ఉన్న యాంటీ డ్రగ్ హెల్ప్‌లైన్ 1908 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో పోలీసుల దృష్టికి తీసుకురావడం ద్వారా అనేక నేరాలను ముందుగానే అడ్డుకోవచ్చని, ముఖ్యంగా యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచడంలో ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.

డ్రగ్స్ కేసుల్లో కేసు నమోదు నుంచి దర్యాప్తు, ఆధారాల సేకరణ, నిందితుల గుర్తింపు, తదుపరి న్యాయపరమైన చర్యల వరకు అనుసరించాల్సిన విధివిధానాలపై పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. దర్యాప్తు సమయంలో ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలి, కేసులను మరింత పకడ్బందీగా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశాలపై కూడా సూచనలు చేశారు.

విద్యాస్థాయిలో చర్యలు తీసుకోవాలి

జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతను మాదకద్రవ్యాల ప్రభావం నుంచి రక్షించేందుకు విద్యాసంస్థల స్థాయిలో అవగాహన, పర్యవేక్షణ, ముందస్తు నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

జిల్లాలోని వివిధ కళాశాలల్లో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ స్క్వాడ్ల పనితీరు, వాటి ద్వారా చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, విద్యార్థుల భాగస్వామ్యం తదితర అంశాలను ఈగల్ ఫోర్స్ అధికారులు జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఆయా స్క్వాడ్లను మరింత చురుకుగా పనిచేసేలా ప్రోత్సహించడంతో పాటు, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం సేకరించడం, విద్యార్థుల్లో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై నిరంతర అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించారు.

డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో “నివారణ–అవగాహన–నిఘా–చట్టపరమైన చర్యలు” అనే నాలుగు అంశాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని అధికారులు పేర్కొన్నారు. కేవలం కేసులు నమోదు చేయడం మాత్రమే కాకుండా డ్రగ్స్‌కు డిమాండ్ తగ్గించడం, సరఫరా మార్గాలను గుర్తించడం, యువతను ముందుగానే అప్రమత్తం చేయడం, డ్రగ్స్‌కు బానిసైన వారికి అవసరమైన సహాయాన్ని అందించే విధంగా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు.

భవిష్యత్తులో జిల్లాలో నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల ద్వారా డ్రగ్స్ వ్యతిరేక అవగాహనను మరింత విస్తృతం చేయడంతో పాటు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై నిఘాను మరింత పటిష్టం చేయనున్నట్లు సమావేశంలో స్పష్టమైంది. యువత భవిష్యత్తును కాపాడే లక్ష్యంతో పోలీస్ శాఖ చేపట్టే ప్రతి చర్యకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

ఈ సమావేశంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ – డీఎస్పీ బుచ్చయ్య, గద్వాల్ డీఎస్పీ వై. మొగిలయ్య, ఈగల్ ఫోర్స్ బృందం, గద్వాల్, అలంపూర్, శాంతినగర్ సర్కిల్ అధికారులు, ఎస్సైలు, డీసీఆర్‌బీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>