కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిందీ విభాగం ఆధ్వర్యంలో హిందీ దివస్ వేడుకలను (Hindi Diwas Celebrations) మంగళవారం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా మక్లూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. భోజ్ రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హిందీ భాషా వికాసంలో ఉన్న చారిత్రక నేపథ్యాన్ని వివరించారు.
పాఠ్యాంశాల్లోని కబీర్ దాస్ వంటి కవులు అవధి, బ్రజ్ భాషల్లో రచనలు చేసినప్పటికీ అవి హిందీ మాండలికాల్లో భాగమేనని తెలిపారు. హిందీ భాషా వికాసంలో ఫోర్ట్ విలియం కళాశాల పాత్రతో పాటు ఖడీ బోలీ కవులు, ఇతర రచయితల కృషిని వివరించారు. నేటి వైజ్ఞానిక, వాణిజ్య రంగాల్లో ప్రకటనల ద్వారా హిందీ భాషకు విస్తృత ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.
హిందీ దివస్ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యు. గంగాధర్, హిందీ విభాగ అధ్యక్షురాలు డాక్టర్ డి. హేమలత, అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ పి.జి. రెడ్డి, సుభాష్, డాక్టర్ రజిత, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

