పెద్దపల్లిలో బీజేపీ భారీ నిరసన

కలం, ​పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని అబద్ధపు హామీలను కప్పిపుచ్చుకోవడానికే పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు (Vijaya Ramana Rao) చవకబారు రాజకీయం చేస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ సమీపంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి భారీ నిరసన (BJP Protest) కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ పెంజర్ల రాకేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానంద, మండల అధ్యక్షులు వేల్పు రమేష్, కారెంగుల శ్రీనివాస్, చిలివేరి సంపత్ మాట్లాడుతూ.. కలెక్టరేట్ ముందు ఎమ్మెల్యే చేపట్టిన ధర్నా, దిష్టిబొమ్మ దహనం కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకేనని విమర్శించారు. చేతనైతే ముందు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, SRSP నీళ్లు అందించి మాట్లాడాలని సవాల్ విసిరారు.

ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ నైతిక దివాళాకోరుతనం

పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మందికి పైగా సర్పంచులు ఉన్నారని, ఎమ్మెల్యేకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయా గ్రామాల్లో ఎంతమంది ఓట్లను తొలగించారో గ్రామాల వారీ ఆధారాలను వెంటనే బయటపెట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. 2002లోనే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) విధానాన్ని తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, నాడు తాము నిర్ణయాలు తీసుకుని నేడు ఎన్నికల కమిషన్‌పై నిందలు వేయడం వారి నైతిక దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా పనిచేసే ఎలక్షన్ కమిషన్ చేసే నిరంతర చట్టబద్ధమైన ప్రక్రియపై బురద చల్లడం సరికాదన్నారు.

​హామీలు ఏమయ్యాయి?

అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, పూర్తిస్థాయి రైతు రుణమాఫీ, మహిళలకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ ఏమయ్యాయని ప్రశ్నించారు. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, ప్రజలు హామీల గురించి నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల కమిషన్‌పై నెపం నెడుతున్నారని ధ్వజమెత్తారు.

ఢిల్లీ అధిష్టానం మెప్పు కోసం నాటకాలు ఆడటం మానుకుని, ఓటర్ల నిజమైన జాబితా బయటపెట్టాలని, లేనిపక్షంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తంగెడ రాజేశ్వరరావు, పోల్సాని సంపత్ రావు, గర్రెపల్లి నారాయణస్వామి, వేల్లంపల్లి శ్రీను, జ్యోతిబాస్, తూడు రవి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, రాజేంద్రప్రసాద్, ఫహీమ్, రమేష్, వెంకటేష్, ఎర్రోళ్ల శ్రీకాంత్, ఉప్పు కిరణ్, మహంతా‌తో పాటు రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల నాయకులు, యువమోర్చా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>