తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు.. కేఆర్ఎంబీకి లేఖ

కలం, వెబ్ డెస్క్ : కృష్ణా నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి తెలంగాణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తెలంగాణలో చేపడుతున్న పలు ఎత్తిపోతల, సాగునీటి పథకాలను (Telangana Projects) అడ్డుకోవాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. అక్టోబర్ 1న నిర్వహించనున్న కేఆర్ఎంబీ సమావేశం అజెండాలో ఈ అంశాలను చేర్చాలని విజ్ఞప్తి చేసింది.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై అభ్యంతరం

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (Palamuru Rangareddy Project) నిర్మాణాన్ని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అదేవిధంగా కల్వకుర్తి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలను కూడా అడ్డుకోవాలని కేఆర్ఎంబీని అభ్యర్థించింది. మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.

పలు రిజర్వాయర్ల సామర్థ్యంపై అభ్యంతరాలు

జవహర్ నెట్టెంపాడు పథకంలోని రేలంపాడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచే ప్రతిపాదనను కూడా నిలిపివేయాలని కోరింది. పులిచింతల బ్యాక్‌వాటర్‌పై ప్రతిపాదించిన రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకంపైనా అభ్యంతరం తెలిపింది.

మరిన్ని పథకాలను నిలిపివేయాలని డిమాండ్

జాన్‌పహాడ్, బెట్టెతాండా ఎత్తిపోతల పథకాలను కూడా నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం (AP Government) కేఆర్ఎంబీని కోరింది. నక్కగూడెం, ముక్త్యాల పథకాలపై అభ్యంతరాలను లేఖలో ప్రస్తావించింది. తెలంగాణ చేపడుతున్న ఆయా ప్రాజెక్టులపై బోర్డు సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

811 టీఎంసీలపై ఏపీ డిమాండ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో కేటాయించిన 811 టీఎంసీలను 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది. ఈ అంశాన్ని అక్టోబర్ 1 సమావేశంలో చర్చించడంతో పాటు తెలంగాణ ప్రాజెక్టుల(Telangana Projects)పై తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో పేర్కొంది.

Also Read: సంక్షోభంలో డెయిరీ.. సంచలనంలో ఎన్నికలు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>