కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ ఎంజీఎం (Warangal MGM) ఆస్పత్రిలో వరుసగా జరిగిన ఘటనలు రోగుల భద్రతపై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ఆరోగ్యశ్రీ వార్డులో సీలింగ్ పెచ్చులు ఊడిపడి పలువురు రోగులు గాయపడిన ఘటన మరువకముందే ఆర్‌ఐసీయూ, ఫిజియోథెరపీ వార్డుల్లోనూ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
పాత భవనంలో భద్రతేదీ?
ఎంజీఎం భవనాలు పాతవి కావడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే వరుస ఘటనల నేపథ్యంలో ముందస్తు మరమ్మతులు, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడం, రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు ఎంతవరకు చేపడుతున్నారనేది ప్రశ్నగా మారింది. ముఖ్యంగా చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన రోగులపైనే భవనం నుంచి పెచ్చులు పడటం ఆందోళన కలిగిస్తోంది. ఆరోగ్యశ్రీ వార్డులో జరిగిన ఘటనలో చికిత్స పొందుతున్న మస్తాన్ సహా ముగ్గురు గాయపడినట్లు సమాచారం. ఘటన అనంతరం వారిని మరో వార్డుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
కొత్తది వస్తోంది.. పాత ఆస్పత్రి సంగతేంటి?
వరంగల్‌లో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నిర్మాణ పనుల్లో జాప్యంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల సమీక్ష నిర్వహించి, 30 రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోజువారీ పర్యవేక్షణతో పాటు త్వరగా ఓపీ సేవలు ప్రారంభించాలని సూచించారు. తాజా సమాచారం ప్రకారం కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అక్టోబర్‌లో 18 అంతస్తులను సిద్ధం చేసి, నవంబర్‌లో ప్రారంభోత్సవం చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎంవో అధికారులు వెల్లడించారు.
కొత్త ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్న వేళ పాత ఎంజీఎం భవనాల భద్రతపై కూడా సమాన స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం లేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొత్త భవనంలో సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు వేలాది మంది రోగులకు ఎంజీఎంనే కీలక వైద్య కేంద్రంగా ఉండనుంది.
పెచ్చుల ఘటన.. ఆ తర్వాత ఉద్రిక్తత
ఎంజీఎంలో వరుస ఘటనలతో బాధితులను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో వినయ్‌భాస్కర్ అస్వస్థతకు గురైనట్లు, అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసులు భద్రతా కారణాలతో అడ్డుకున్నట్లు, మరోవైపు బీఆర్‌ఎస్ నేతలు పోలీసుల తీరును ప్రశ్నించినట్లు ప్రచారంలో ఉంది.
దీంతో చర్చ రాజకీయ వివాదం వైపు కాకుండా ఆస్పత్రిలో రోగుల భద్రత అంశంపై కేంద్రీకృతం కావాల్సిన అవసరం ఏర్పడింది. రోగులు, బంధువులకు భద్రత కల్పించడంతో పాటు పాత భవనాల పరిస్థితిని నిపుణులతో పరిశీలించి, ప్రమాదకర ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త ఆస్పత్రి వచ్చే వరకు భరోసా ఏది?
కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తయి, సేవలు అందుబాటులోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు ఎంజీఎంలో చికిత్స పొందుతున్న రోగుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ఆస్పత్రి ప్రారంభోత్సవంపై జరుగుతున్న హడావుడి మధ్య పాత ఎంజీఎం భవనాల మరమ్మతులు, భద్రతా తనిఖీలు, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, రోగుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై స్పష్టమైన కార్యాచరణ ఏమిటి? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

