కలం, వనపర్తి ప్రతినిధి: ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారి పేర్లు తొలగిస్తున్నారంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి సమీకృత కలెక్టరేట్ ఎదుట ఎలక్షన్ చోర్ ఆఫ్ ఇండియా పేరుతో నిరసన ధర్నా(Congress Protest) నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు శివసేనరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శివసేనరెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యువతకు చెందిన అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు. ఓట్ల తొలగింపునకు ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తోందని ఆరోపిస్తూ సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను(Gyanesh Kumar) అరెస్టు చేసి, పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్‌లో విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కొత్త ఓటర్ల నమోదులో అనవసర నిబంధనలు విధిస్తున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆధారాలతో ప్రజెంటేషన్లు ఇస్తున్నారని తెలిపారు.
ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పారదర్శక విచారణ జరగాలని కోరారు. సీఈసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఏ పార్టీకి అనుకూలంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని అన్నారు. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఒక్కరి పేరు కూడా తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
జ్ఞానేశ్‌కుమార్ బీజేపీ కండువా కప్పుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే చర్యలను సహించబోమన్నారు. ఓటు హక్కును పరిరక్షించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై పారదర్శకత అవసరమన్నారు.
ఓటర్ల జాబితా ప్రక్రియను అడ్డుపెట్టుకుని అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభికి కాంగ్రెస్ నేతలు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా, మండల, పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన, మహిళా, మైనార్టీ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

