కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palvancha) పట్టణంలోని పలు దుకాణాలపై ఆదివారం తూనికలు, కొలతల శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. మెరుపు తనిఖీలు నిర్వహించారు. భద్రాచలం తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ సుభాష్ ఆధ్వర్యంలో అధికారులు ప్రధాన వ్యాపార కేంద్రాలపై సర్జికల్ స్ట్రైక్ తరహాలో దాడులు చేపట్టారు. మటన్, చికెన్, చేపలు, కూరగాయల దుకాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తూనికల యంత్రాల్లో వ్యత్యాసాలు, తక్కువ కొలతలతో వినియోగదారులను మోసం చేయడం, నిబంధనలు పాటించని 12 మంది వ్యాపారులకు రూ.38,500 జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ సుభాష్ మాట్లాడుతూ… వ్యాపారులు కచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సర్టిఫై చేసిన తూనిక సాధనాలను వాడాలన్నారు. వినియోగదారులను మోసం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. తూకాల్లో తేడాలు వచ్చినా, కస్టమర్లను మోసం చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు కూడా మోసపోకుండా కొలతల్లో ఏమైనా తేడాలు అనిపిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

